calender_icon.png 22 October, 2024 | 5:13 AM

ఎన్నికల్లో విఫలంపై బీజేపీ సమీక్షించుకోవాలి

16-10-2024 12:57:25 AM

ఆర్వోబీ పనులపై మహేశ్‌గౌడ్ తప్పుడు విమర్శలు 

నిజామాబాద్ ఎంపీ అర్వింద్

నిజామాబాద్, అక్టోబర్ 15 (విజయక్రాంతి): పార్లమెంటు, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సత్తా చాటుతున్న బీజేపీ తెలంగాణలో ఎందు కు అధికారంలోకి రావడం లేదో బీజేపీ నాయకత్వం సమీక్ష చేసుకోవాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ అన్నారు. రాష్ట్రంలో 8 ఎంపీ సీట్లు సాధించిన బీజేపీ, గతంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో 48 డివిజన్లలో విజయం సాధించిందన్నా రు.

అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 8 సీట్లలోనే విజయం సాధించిందని, జీహెచ్‌ఎంసీ పరిధిలో 48 డివిజన్లలో విజయం సాధించిన బీజేపీ హైదరాబాద్ నగరంలో ఒక్క ఎమ్మె ల్యే సీటు సాధించలేదని ఆయన అన్నారు. నిజామాబాద్ కలెక్ట రేట్‌లో మంగళవారం పెండింగ్ రైల్వే అండర్ బ్రిడ్జిలు, ఓవర్ బ్రిడ్జిల పనులపై ఆయన జిల్లాస్థాయి అధికారులతో సమీక్షించారు. అనంత రం మీడియా సమావేశంలో మాట్లాడారు.

గ్రేటర్ హైదరాబాద్‌లో ప్రజలు బీజేపీకి ఓటేసేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ పార్టీ ఎందుకు అధికారంలోకి రావడం లేదో పార్టీ నాయకత్వం ఆలోచించాలని కోరారు. దీనికి బాధ్యులెవరో గుర్తించాలని పార్టీ నాయకత్వనికి సూచించారు. కాగా దేశంలోనే అత్యధిక ఆర్వోబీలు నిజామాబాద్ జిల్లాకు మంజూరయ్యాయని అర్వింద్ తెలిపారు.

ఆర్వోబీ పనుల పురోగతిపై కలెక్టర్, అధికారులతో సమీక్షించిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఆర్వోబీ పనులు ఆలస్యంగా కొనసాగుతున్నాయని విమర్శించారు. మాధవ నగర్ ఆర్వోబీకి రూ.103 కోట్లు అవసరమైతే కేంద్ర ప్రభుత్వం తన వాట కింద రూ.93 కోట్లు ఇచ్చిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన రూ.పదికోట్లు ఇవ్వకపోవడంతో, కాంట్రాక్టర్ తన సొంత డబ్బులతో పనులు చేపడుతున్నారని తెలిపారు.

అర్సాపల్లి ఆర్వోబీలో రూ.135 కోట్లలో కేంద్రం 95 శాతం నిధులను ఎప్పుడో విడుదల చేసిందని, రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన 5 శాతం నిధులు వెంటనే విడుదల చేయాలని కోరారు. ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన 3.5 ఎకరాల భూమిని వెంటనే కేటాయించాలని కోరారు. పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ ఈ విషయాలు తెలుసుకుని విమర్శించాలని సూచించారు.

ఆయన ప్రత్యక్ష ఎన్నికల్లో గెలవలేదని, కనీసం కౌన్సిలర్‌గా సైతం ఎన్నిక కాలేదని ఎంపీ అర్వింద్ ఎద్దేవా చేశారు. తనను విమర్శించే ముందు రాష్ట్ర ప్రభు త్వం విడుదల చేయాల్సిన నిధులపై శ్రద్ధ చూపాలన్నారు. రాష్ట్రంలో 28 ఇంటిగ్రేటెడ్ సూళ్లు మంజూరైతే నిజామాబాద్ జిల్లాకు అందులో ప్రాధాన్యత ఇవ్వలేదని, నిధులు, ప్రాజెక్టులన్నీ నల్గొండ, ఖమ్మం జిల్లాలకు మళ్లిస్తున్నారని ఎంపీ అర్వింద్ విమర్శించారు.