09-03-2025 12:21:18 AM
పార్టీ శ్రేణులతో రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్
హైదరాబాద్, మార్చి 8 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ 2 స్థానాలు కైవసం చేసుకోవడంపై బీజేపీ రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ బన్సల్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన పార్టీ నేతలు, కార్యకర్తలను ఆయన అభినందించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డితో కలిసి శనివారం వివిధ మోర్చాలు, జిల్లా అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు.
భవిష్యత్తులో పార్టీని రాష్ట్రంలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ప్రతిఒక్కరూ కష్టపడి పనిచేయాలని పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకురావాలని భావిస్తున్న ఒకే దేశం ఒకే ఎన్నిక విధానాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకుపోవాలని పార్టీ శ్రేణులకు బన్సల్ సూచించారు. రాబోయే స్థానిక సంస్థల్లోనూ బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించేలా ప్రణాళికలు రూపొందించాలని కోరారు.
మాజీ ప్రధాని వాజ్‌పేయీ శత జయంతి ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు అందరూ సిద్ధం కావాలని సూచించారు. ఈ సందర్భంగానే బీజేపీ తెలంగాణ అధ్యక్ష నియామకంపైనా సునీల్ బన్సల్ పార్టీ ముఖ్య నేతలతో చర్చించారని సమాచారం. మెదక్ ఎంపీ రఘునందన్ రావు, పార్టీ రాష్ట్ర సంస్థాగత కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శులు గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, కాసం వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.