02-04-2025 10:14:43 PM
రాష్ట్ర ఐడిసి చైర్మన్ మువ్వా విజయ్ బాబు..
ఇల్లెందు (విజయక్రాంతి): దేశంలో భాజపా రాజ్యాంగ స్ఫూర్తిగా వ్యతిరేకంగా పాలన కొనసాగిస్తుందని రాష్ట్ర ఐడిసి చైర్మన్ మువ్వా విజయ్ బాబు అన్నారు. ఏఐసీసీ అగ్ర నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు బుధవారం జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని మూడో వార్డులో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ఐ డి సి చైర్మన్, ఇల్లందు నియోజకవర్గ ఇన్చార్జ్ మువ్వ విజయబాబు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతం ఆలపించారు.
భారతదేశం నేడు విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటోందని, గత 10 ఏళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అవమాన పరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామ్య పాలన కొనసాగిస్తుందన్నారు. రాజ్యాంగం ప్రకారం ప్రజాస్వామ్య వ్యవస్థలను కాపాడుతూ, గౌరవిస్తూ పాలన చేయాల్సిన పాలకులు నేడు వ్యవస్థలను నాశనం చేస్తూ తమ ఆధీనంలోకి తీసుకొని ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాలరాస్తున్నారన్నారు. దేశ ప్రజలకు సమాన హక్కులు, సమన్యాయం కల్పించాల్సిన పాలకులు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తున్న నేటి బిజెపి పాలకుల తీరు తీవ్ర ఆక్షేపానియంగా ఉందని విమర్శించారు.
రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను కాలరాస్తూ కట్టు, బొట్టు, తిండి, పూజ అన్నిటి పైన ఆంక్షలు పెడుతూ ప్రజల హక్కులను హరించి వేస్తున్నారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ తాజా మాజీ చైర్మన్లు, డైరెక్టర్లు, ఇల్లందు మున్సిపల్ మాజీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, నియోజకవర్గంలోని అన్ని మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, నియోజకవర్గ నాయకులు, నియోజకవర్గ మహిళా నాయకురాలు, విద్యార్థి విభాగం, ఐఎన్టియుసి నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, మాజీ కౌన్సిలర్లు, నియోజకవర్గంలోని అన్ని మండలాల నాయకులు కార్యకర్తలు, ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల నాయకులు, పట్టణ మహిళా కమిటీ నాయకులు, కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.