తమిళనాడులో కమలానికి ఉన్న అవకాశమిదే!
ద్రవిడుల మద్దతు లేకుంటే నెగ్గలేమనే భావనలో బీజేపీ పెద్దలు
ఇప్పటికే ఈ దిశగా పావులు కదుపుతున్న అధిష్ఠానం
2026 ఎన్నికలే లక్ష్యంగా అన్నాడీఎంకేతో పొత్తుపై చర్చలు
చెన్నై, నవంబర్ 22: ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ అనుకున్న స్థాయిలో రాణించలేదు. కాషాయ పార్టీ బలంగా ఉన్న ఉత్తరాదిలో గతంలో కంటే తక్కువ సీట్లే దక్కించుకుంది. ఇది కమల దళానికి పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు. అందుకే ఎప్పటినుంచో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి సారిస్తోంది. కర్ణాటక మినహా బీజేపీ ద్రవిడ రాష్ట్రాల్లో పెద్దగా రాణించడం లేదు. ఇక్కడి ప్రాంతీయ శక్తులను తట్టుకుని పట్టు సాధించలేకపోతోంది.
కానీ గత ఎన్నికల్లో అనూహ్యంగా దక్షిణాదిలో కీలక విజయాలు అందుకుంది. తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా 8 సీట్లు దక్కించుకోగా.. ఏపీలోనూ టీడీపీతో పొత్తు పెట్టుకుని అక్కడ ప్రభుత్వంలో కూటమిగా ఏర్పడింది. కేరళలోనూ బోణీ కొట్టింది. ద్రవిడ, ప్రాంతీయ భావజాలం అధికంగా ఉండే తమిళనాడులో మాత్రం నామమాత్రంగానే మిగిలిపోయింది. దీంతో తమిళనాడులో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ పావులు కదుపుతోంది. 2026 అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. రాష్ట్రంలో తమ తో కలిసివచ్చే ఏకైక పార్టీ అన్నాడీఎంకేనే తమ కు ఉనికికి మార్గం చూపగలదని భావిస్తోంది.
చర్చలపై దృష్టి..
తమిళనాడులో కొంతైనా ప్రభావం చూపాలంటే అన్నాడీఎంకేతో పొత్తును పునరుద్ధరించుకోవడం తప్ప ఇంకో మార్గం లేదని బీజేపీ అధిష్ఠానం భావిస్తోంది. గతంలో విజయక్రాంతి కూడా ఇదే విషయాన్ని ప్రస్ఫుటం చేసింది. తమిళనాడు వంటి బలమైన ప్రాంతీ య భావం ఉన్న రాష్ట్రాల్లో స్థానిక పార్టీలే జాతీయ పార్టీలకు చుక్కానీ వంటివి. అందుకే ఢిల్లీ నాయకత్వం సూచనల మేరుకు రాష్ట్రస్థాయి నేతలు ఇప్పటికే అన్నాడీఎంకే పెద్దల తో చర్చలు కూడా ప్రారంభించారు.
2026 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ విజయం సాధించేందుకు ద్రవిడుల మద్దతు తప్పనిసరి అనే విష యాన్ని పార్టీ అధిష్ఠానం గుర్తించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రయోజనం ఉండదనే భావి స్తున్నట్లు పార్టీ పెద్దలు పేర్కొంటున్నారు.
4 స్థానాల్లో విజయం..
2021 అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ కలిసి బరిలోకి దిగగా కమల దళానికి నాలుగు స్థానాలు దక్కాయి. బీజేపీ గెలిచిన స్థానాల్లో కోయంబత్తూర్ నియోజకవర్గం కూడా ఉంది. ఈ స్థానం నుంచి తమిళ సూపర్‌స్టార్ కమల్‌హాసన్ పోటీ చేసినప్పటికీ ఇరు పార్టీలు కలిసి పని చేయడంతో ఆయనకు ఓటమి తప్పలేదు. కమల్‌పై మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు వనతి శ్రీనివాసన్ గెలుపొందారు. కానీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండు పార్టీల మధ్య విబేధాలు వచ్చాయి.
అన్నామలై బాధ్యతలు స్వీకరించిన తర్వాత దూకుడుగా వ్యవహరించారు. ఈ క్రమంలోనే ప్రముఖ ద్రవిడియన్ నేతలైన సీఎన్ అన్నాదురై, జయలలితపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అన్నామలై వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన అన్నాడీఎంకే గతేడాది సెప్టెంబర్ 25న బీజేపీతో పొత్తును తెంచుకున్నట్టు అధికారికంగా ప్రకటించింది. పదే పదే తమ నేతలపై అన్నామలై చేస్తున్న అవమానకర వ్యాఖ్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు పార్టీ ప్రకటించింది.
కలిసి పోటీ చేస్తే..
2024 లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే, బీజేపీ ఒంటరిగా పోటీ చేశాయి. ఎన్నికల్లో అన్నాడీఎంకే 22.6 శాతం, బీజేపీ 19.6 శాతం ఓట్లను పొందినప్పటికీ ఒక్క సీటును కూడా గెలుచుకులేకపోయాయి. డీఎంకే కూటమే రా ష్ట్రంలోని 39 స్థానాలను గెలుచుకుంది. ఒకవేళ అన్నాడీఎంకే, బీజేపీలు కలిసి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసి ఉంటే 10 స్థానాల్లో విజయం సాధించేవని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. లోక్‌సభలోనూ బీజేపీ బలం పెరిగి ఉండేదని పేర్కొంటున్నారు.