calender_icon.png 27 November, 2024 | 1:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రైతు సమస్యలపై బీజేపీ రణభేరి

18-05-2024 01:18:07 AM

నేడు బీజేపీ నేతల వడ్ల కల్లాల సందర్శన

21న అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో దీక్షలు

బీజేపీ నేతలతో టెకాన్ఫరెన్స్‌లో బండి సంజయ్

కరీంనగర్, మే 17 (విజయక్రాంతి): కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో రైతు సమస్యలపై బీజేపీ రణభేరి మోగించింది. ఒకవైపు 6 గ్యారెంటీల అమలుపై వివిధ రూపాల్లో కాంగ్రె స్ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నిర్ణయించిన బీజేపీ.. రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా రణభేరికి పిలుపునిచ్చింది. అందులో భాగంగా బీజేపీ నేతలంతా తమతమ ప్రాంతాల్లో వడ్ల కల్లాలను సందర్శించి రైతులకు అండగా నిలవాలని నిర్ణయించింది. ఇప్పటికే అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం ఘోరంగా విఫల మైందని ఆరోపిస్తున్నది.

ప్రకృతి వైపరీత్యాలను అధిగమించి పంటను కల్లాల వద్దకు తీసుకువచ్చి రోజులు గడుస్తున్నప్పటికీ కొనుగోలు చేయడంలో ఉదాసీన వైఖరి అవలంబిస్తున్న రాష్ట్ర ప్రభుత్వ తీరును ఎండగట్టాలని నిర్ణయించింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కుమార్ శుక్రవారం కరీంనగర్ పరిధిలోని మండల కమిటీలు, వివిధ కమిటీల నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయిన రైతుల వివరాలను సేకరించేందుకు వడ్ల కల్లాలను సందర్శించాలని కోరారు. తద్వారా పంట నష్టం వివరాలను సేకరించడంతోపాటు తాలు, తరుగు, తేమతో సంబంధం లేకుండా వడ్లను కొనుగోలు చేసేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు.

అదే సమయంలో కాంగ్రెస్ ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వడ్లకు క్వింటాలుకు 500 రూపాయల చొప్పున బోనస్ ఇవ్వాలని, సన్న, దొడ్డు అనే తేడా లేకుండా అన్ని రకాల వడ్లకు బోనస్ ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రైతులకు అండగా నిలవాలని కోరారు. దీంతోపాటు రైతు భరోసా కింద వచ్చే వానాకాలం సీజన్ నుండి రైతులు, కౌలు రైతులకు ఎకరాకు 15 వేలు, రైతు కూలీలకు 12 వేలు ఇచ్చేదాకా సర్కార్‌పై వివిధ రూపాల్లో నిరసనలు తెలుపాలని సూచించారు.

రైతులకు 2 లక్షల రుణమాఫీ చేయాలంటే దాదాపు రూ.35 వేల కోట్ల నిధులు అవసరమని, ఆ నిధులు రాష్ట్ర ప్రభుత్వం వద్ద లేవని అన్నారు. శనివారం వడ్ల కల్లాలను సందర్శించాలని, ఆదివారం మండల, నియోజకవర్గ కేంద్రాల్లో మీడియా సమావేశాలు నిర్వహించి రైతుల బాధలను ప్రపంచానికి తెలియజేయాలని పిలుపునిచ్చారు. ఈ నెల 20న అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో తహసీల్దార్లు, ఆర్డీవో, కలెక్టర్లకు రైతు సమస్యలపై వినతిపత్రం అందజేయాలని ఆదేశారు. అలాగే ఈ నెల 21న కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో రైతులపక్షాన దీక్షలు చేపట్టాలని కోరారు.