ఆయన గొప్పతనం సమయం సరిపోదు
వెంకయ్య జీవితం నేటి తరానికి స్ఫూర్తిదాయకం
బీజేపీ వటవృక్షంగా మారడంలో ఆయన పాత్ర కీలకం
మాజీ ఉపరాష్ట్రపతి సేవలను కొనియాడిన ప్రధాని
వెంకయ్య జీవిత చరిత్ర గ్రంథాలు ఆవిష్కరించిన మోదీ
హైదరాబాద్, జూన్ 30 (విజయక్రాంతి): మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడి గొప్పతనం గురించి చెప్పేందుకు సమయం సరిపోదని, ఆయనది అత్భుతమైన వాక్చాతుర్యం అని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గ్రామస్థాయి నుంచి ఉన్నత స్థానానికి ఎదిగిన ఆయన నుంచి వేలమంది కార్యకర్తలు ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. బీజేపీ దేశవ్యాప్తంగా విస్తరించటానికి వెంకయ్య ఎంతో శ్రమించారని ప్రశంసించారు. వెంకయ్య జీవితంపై రచించిన పుస్తకాలు ప్రజలకు ప్రేరణగా నిలుస్తాయని, దేశ ప్రజల సేవకు మార్గనిర్దేశం చేస్తాయని చెప్పారు.
వెంకయ్య నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆయన జీవిత ప్రస్థానంపై ప్రచురితమైన మూడు పుస్తకాలను ప్రధాని ఆదివారం వర్చువల్‌గా ఆవిష్కరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలోని అన్వయ కన్వెక్షన్ సెంటర్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ‘సేవలో వెంకయ్యనాయుడు జీవితం’, ‘13వ ఉప రాష్ర్టపతిగా వెంకయ్యనాయుడు లక్ష్యం, సందేశం.. మహానేత వెంకయ్యనాయుడు జీవితం, ప్రయాణం అనే మూడు పుస్తకాలను ప్రధాని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మోదీ సందేశమిస్తూ వెంకయ్య నుంచి తాను చాలా నేర్చుకున్నానని తెలిపారు.
మంచి ఆలోచనలు, మంచి వ్యక్తిత్వం, దార్శనికతల మేలు కలయికే వెంకయ్య నాయుడి జీవితమని కొనియాడారు. వెంకయ్యతో తన అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ‘ఒక చిన్నగ్రామం నుంచి ప్రస్థానం మొదలు పెట్టి పెద్దపెద్ద పదవులు చేపట్టిన వెంకయ్య నాయుడి అనుభవ సంపద అమూల్యం. ఆయన నుంచి నేను చాలా నేర్చుకున్నాను’ అని పేర్కొన్నారు. బీజేపీ ఇవాళ వటవృక్షంగా మారిందంటే వెంకయ్య నాయుడు లాంటి కార్యకర్తల కష్టం ఎంతో ఉందని అన్నారు.
పదవి వదులుకొనే పార్టీ మారాలి
ప్రధాని మోదీ దేశ ప్రజలకు అందిస్తున్న సేవలు దీర్ఘకాలం కొనసాగించాలని వెంకయ్యనాయుడు కోరారు. మోదీ రిఫార్మ్, పర్ఫార్మ్, ట్రాన్స్‌ఫార్మ్.. నినాదంతో ముందుకెళ్తున్నారని కొనియాడారు. ప్రజలను సోమరిపోతులను చేసే ఉచితాలకు తాను వ్యతిరేకమని, అయితే అవసరం ఉన్నంత వరకు ఉచిత రేషన్ పథకం కొనసాగించాలని కేంద్రానికి సూచించారు. యువత నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను కొనసాగించాలని కోరారు. మాతృభాషలను కేంద్రం ప్రోత్సహించడం గొప్ప విషయమని ప్రశంసిం చారు. ప్రభుత్వ ఆదేశాలన్నీ భారతీయ భాషల్లోనే ఉండాలని సూచించారు. భారతీయ భాషల తర్వాతే ప్రభుత్వ ఆదేశాలు ఆంగ్ల భాషలో ఉండాలని అన్నారు.
మాతృభాష, సోదర భాష తర్వాతే ఇతర భాషలకు ప్రాధా న్యం ఇవ్వాలని తెలిపారు. ‘ఉత్సాహం ఉన్నవాళ్లు రాజకీయాల్లోకి రావాలి. సిద్ధాంతపర మైన రాజకీయాలను ప్రోత్సహించాలి. చట్ట సభలకు ఎంపికైనవారు హుందాగా ప్రవర్తించాలి. విలువలు పాటిస్తూ మాతృభాషను ప్రోత్సహిస్తూ ముందుకు సాగాలి. విలువలు కాపాడాల్సిన బాధ్యత రాజకీయ నాయకులపై ఉంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియట్లేదు. సిద్ధాంతం నచ్చకపోతే నాయకులు పార్టీ మారవచ్చు. పార్టీ ద్వారా వచ్చిన పదవిని వదిలి వెళ్లాలి. కార్యకర్తలకు నేతలు ప్రవర్తనా నియమావళి రూపొందించాలి. రాజకీయాల్లో జవాబుదారీతనం తీసుకురావడానికి ప్రయత్నించాలి.
రాజకీయాల్లో కులం, ధనం ప్రభావం తగ్గిపోవాలి. గుణం చూసి నాయకులకు ఓటు వేయాలి. మార్పు రాకపోతే ప్రజాస్వామ్యం బలహీనపడుతుంది. దేశ ప్రతిష్ఠను నిలబెట్టాలంటే చెడుపోకడలను అడ్డుకోవాలి’ అని వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌లో చాలా లొసుగులున్నాయని, వాటిని మార్చి ఫిరాయింపులను అరికట్టాల్సిన అవసరం ఉందని అన్నారు. పార్టీ మారాలంటే ప్రస్తుతం ఉన్న పదవికి రాజీనామా చేసి వెళ్లాలని అన్నారు. ఎన్జీ రంగా రాజకీయ శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటుచేశారని, ఇప్పటి నేతలకు కూడా తరగతులను ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందని పేర్కొన్నారు.
తాను ఒక్క పైసా కూడా ఖర్చుపెట్టకుండా ఎన్నికల్లో గెలిచానని, ప్రజలే డబ్బులు ఇచ్చి తనను గెలిపించారని గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో గవర్నర్లు సీపీ రాధాకృష్ణన్, హరిబాబు, కేంద్ర మంత్రి జీ కిషన్‌రెడ్డి, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఏపీ మంత్రి సత్యకుమార్, ఎంపీలు రఘునందన్, భరత్, ఎమ్మెల్యేలు సుజనా చౌదరి, రఘురామకృష్ణ రాజు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, విజయక్రాంతి సీఎండీ సీఎల్ రాజం, డీఆర్డీవో మాజీ చైర్మన్ సతీష్‌రెడ్డి, గ్రంథి మల్లికార్జున్‌రావు, బీవీఆర్ మోహన్‌రెడ్డి, సినీ నటుడు సాయికుమార్ తదితరులు పాల్గొన్నారు.
జైళ్లో వేసినా వెనుకంజ వేయలేదు
ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా వెంకయ్య నాయుడు పోరాడారని గుర్తు చేసిన ప్రధాని మోదీ.. 17 నెలలపాటు జైల్లో నిర్బంధించినా ఆయన వెనకంజ వేయకుండా ధైర్యంగా పోరాడారని కొనియాడారు. వెంకయ్య రాజకీయాలను, అధికారాన్ని సేవా మార్గంగా భావించారని కితాబిచ్చారు. వాజ్‌పేయి ప్రభుత్వంలో కేంద్ర మంత్రిగా అవకాశం వచ్చినప్పుడు ఆయన ఏరికోరి గ్రామీణాభివృద్ధి శాఖను తీసుకొన్నారని గుర్తుచేశారు. గ్రామాలకు, పేదలకు, రైతులకు సేవ చేయాలనుకున్నందువల్లే ఆ శాఖను ఇష్టపడ్డారని తెలిపారు. తెలివితేటలు, సహజత్వం, త్వరితగతిన ప్రతిస్పందించే విషయంలో వెంకయ్యకు ఎవరూ సాటి లేరని అన్నారు.
అటల్ జీ నాయకత్వంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడినప్పుడు ‘ఒక చేతిలో బీజేపీ జెండా, మరో చేతిలో ఎన్డీయే అజెండా’ అంటూ ఇచ్చిన నినాదం సంకీర్ణ ప్రభుత్వాన్ని నడిపే తీరుకు నిదర్శనంగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2014లో మోదీ (MODI) అనే అక్షరాలకు మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అనే సంక్షిప పద ప్రయోగాన్ని ఇచ్చారని గుర్తు చేసుకున్నారు. వెంకయ్య నాయుడు రాజ్యసభ చైర్మన్‌గా ఉన్నప్పుడు సభలో జరిగిన సానుకూల చర్చల గురించి ప్రధౠని ప్రస్తావించారు. ఆర్టికల్ 370 రద్దు బిల్లును పూర్తి మెజారిటీ ఉన్న లోక్‌సభలో కంటే మెజారిటీ లేని రాజ్యసభలో ఆమోద ముద్ర వేయడంలో వెంకయ్యది కీలకపాత్ర అని తెలిపారు. సంక్రాంతి వంటి తెలుగు పండుగల సమయంలో ఢిల్లీలో వెంకయ్య నివాసంలో జరిగిన సంబురాల్లో పాల్గొన్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు. వెంకయ్యనాయుడు పరిపూర్ణమైన జీవితాన్ని, సంపూర్ణ ఆరోగ్యంతో గడపాలని ప్రధాని ఆకాంక్షించారు.