calender_icon.png 27 December, 2024 | 4:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

7 నుంచి బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ

03-11-2024 02:02:09 AM

  1. అదేరోజు పార్టీ రాష్ట్ర స్థాయి ఎన్నికల వర్క్‌షాపు
  2. రైతులతో కాంగ్రెస్ సర్కారు నాటకాలు ఆడుతోంది
  3. బీజేపీ సంస్థాగత ఎన్నికల అధికారి యెండల లక్ష్మీనారాయణ

హైదరాబాద్, నవంబర్ 2 (విజయక్రాంతి): పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం పూర్తకావడంతో ఈ నెల 7వ తేదీ నుంచి బీజేపీ సంస్థాగత ఎన్నికల ప్రక్రియ ప్రారంభమవుతుందని బీజేపీ రాష్ట్ర సంస్థాగత ఎన్నికల అధికారి, పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు యెండల లక్ష్మీనారాయణ తెలిపారు.

బూత్ స్థాయి నుంచి జాతీయస్థాయి వరకు సంస్థాగత ఎన్నికలు దశలవారీగా జరుగుతాయని చెప్పారు. ఈ నెల 7వ తేదీన బీజేపీ రాష్ట్ర స్థాయి ఎన్నికల వర్క్‌షాపును నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి రాష్ట్ర ఇన్‌చార్జి సునీల్ భన్సల్, కేంద్ర మంత్రి, పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి, జాతీయ సహాయ ఎన్నికల అధికారి సంబిత్ పాత్రా, పార్టీ ముఖ్య నేతలంతా పాల్గొంటారని తెలిపారు.

శనివారం  ఆయన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గత నెల 21న ఢిల్లీలో అన్ని రాష్ట్రాల సంస్థాగత ఎన్నికల రిటర్నింగ్ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎన్నికల ప్రక్రియపై తమకు దిశా నిర్దేశం చేశారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో 38 సంస్థాగత జిల్లాలకు పార్టీ తరఫున ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించేందుకు జిల్లాలకు ఎన్నికల అధికారులను నియమించామని తెలిపారు.

జిల్లా శాఖల నుంచి ఇద్దరిని జిల్లా సహాయ ఎన్నికల అధికారులుగా నియమించామన్నారు. వారు ఎన్నికల ప్రక్రియకు సహకరిస్తారని అన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిటీకి పార్టీ నేతలు చాడ శ్రీనివాస్ రెడ్డి, తూటుపల్లి రవికుమార్, గీతారాణి సహకరిస్తారని తెలి పారు.

ఎంపీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లాల ఇన్‌చార్జిలు, సభ్యత్వ ప్రము ఖులతో పాటు రాష్ట్ర సభ్యత్వ కమిటీ, క్రియాశీల కమిటీలు, పార్టీ ముఖ్యనేతలంతా ఈ నెల 7వ తేదీన జరిగే రాష్ట్ర ఎన్నికల వర్క్‌షాపునకు హాజరవుతారని తెలిపారు. జిల్లాల వర్క్‌షాపులు ఈ నెల 8,9,10 తేదీల్లో జరుగుతాయన్నారు. మండల ఎన్నికల వర్క్ షాపులు ఈ నెల 11,12,13,14 తేదీల్లో జరుగనున్నట్లు వెల్లడించారు.

వడ్లకు రూ. 500 బోనస్ మాట మర్చిన ప్రభుత్వం కనీసం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడంలోనూ నిర్లక్ష్యం వహిస్తోందని ఆయన ఆరోపించారు. బ్యాంక్ గ్యారెంటీలతో మిల్లర్లు కొనుగోలు చేస్తామని తెలిపారని, కానీ ఇప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో వడ్లు ఎక్కడికి తీసుకుపోవాలో తెలియని దిక్కుతోచని పరిస్థితిలో రైతులు పడిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

రైతుబంధు, రైతు భరోసా లేకుండా పోయిందని విమర్శించారు. రైతు రుణమాఫీ పేరిట కూడా రైతులను మోసం చేశారని ఆరోపించారు. గాంధీ విగ్రహం ఏర్పాటు చేయాలని, కానీ రైతులను కూడా ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులతో నాటకాలు ఆడటం సబబు కాదని హితవు పలికారు.