- అయోధ్య ప్రాణప్రతిష్ఠ రోజే పేలుళ్లకు ప్రణాళిక
- బెంగళూరు రామేశ్వరం కేఫ్ ఘటనలో ఎన్‌ఐఏ చార్జిషీట్
బెంగళూరు, సెప్టెంబర్ 9: బెంగళూరు రామేశ్వరం కేఫ్ బాంబు పేలుడు ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దాఖలు చేసిన చార్జిషీట్‌లో సంచలన విషయాలు వెల్లడయ్యాయి. పేలుడుకు సంబంధించి నలుగురిని నిందితులుగా పేర్కొన్న ఎన్‌ఐఏ.. వారి మొదటి టార్గెట్ నగరంలోని మల్లేశ్వరంలో ఉన్న బీజేపీ కార్యాలయాన్ని పేల్చడ మని తెలిపింది. అయోధ్యలో విగ్రహ ప్రాణప్రతిష్ఠ రోజే బీజేపీ ఆఫీస్‌పై ఐఈడీ దాడి చేసి ఆ తర్వాతే రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు ప్లాన్ చేసినట్లు బెంగళూరు ఎన్‌ఐఏ కోర్టుకు సమర్పించిన చార్జిషీట్‌లో వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో ముస్సావిర్ హుస్సేన్ షాజీబ్, అబ్దుల్ మథీన్ అహ్మద్, మాజ్ మునీర్ అహ్మద్, ముజామ్మిల్ షరీఫ్‌ను నిందితులుగా చేర్చింది.
వీరిలో షాజీబ్, మథీన్ ఐఎస్‌ఎస్ తీవ్రవాదులని తెలిపింది. వీరు డార్క్‌వెబ్‌ను ఉపయోగించి భారత్, బంగ్లాదేశ్ గుర్తింపు కార్డులను పొందారని పేర్కొంది. ఇప్పటికే అరెస్టయిన వీరంతా జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. బెంగళూరులో నిత్యం బిజీగా ఉండే రామేశ్వరం కేఫ్‌లో మార్చి 1న బాంబు పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 9 మంది గాయపడ్డారు. కేసు దర్యాప్తును మార్చి 3న స్వీకరించిన ఎన్‌ఐఏ షాజీబ్ బాంబును అమర్చినట్లు గుర్తించింది. ఘటన జరిగిన 42 రోజుల తర్వాత బెంగాల్‌లో దాక్కున్న నిందితులను ఎన్‌ఐఏ అరెస్టు చేసింది.