calender_icon.png 27 December, 2024 | 5:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎమ్మెల్సీ ఎన్నికలపై బీజేపీ నజర్

02-11-2024 12:00:00 AM

  1. మండలిలో బలం పెంచుకునేందుకు కసరత్తు 
  2. బలమైన అభ్యర్థుల ఎంపికకు త్రిసభ్య కమిటీ 
  3. పలు ఉపాధ్యాయ సంఘాల నుంచి ఇప్పటికే అభ్యర్థులు ఖరారు
  4. ఇంకా క్యాండిడేట్లను ఖరారు చేయని బీజేపీ అనుబంధ సంఘం తపస్

హైదరాబాద్, నవంబర్ 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో త్వరలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న బీజేపీ.. అభ్యర్థుల ఎంపికపై ప్రత్యేకంగా దృష్టి సారించింది. అందులో భాగంగా బలమైన అభ్యర్థుల ఎంపిక కోసం అన్వేషణను షురూ చేసింది.

ఇందుకోసం పార్టీ ముగ్గురితో కమిటీని నియమించింది. కమిటీ తాను సేకరించిన అభిప్రాయాలపై ఒక నివేదికను రూపొందించి రాష్ట్ర నాయకత్వానికి ఇవ్వనుంది. నివేదికను పరిశీలించాక   ఈ వారంలో క్యాండిడేట్లను ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. త్రిసభ్య కమిటీతో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి సైతం పార్టీ మరో కమిటీని నియమించింది.

మూడు స్థానాలకు జరిగే ఎన్నికల్లో సీటు కోసం పోటీ పడుతున్న బీజేపీ నేతలు.. లాబీయింగ్ మొదలు పెట్టారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ స్థానం నుంచి ప్రముఖ విద్యా సంస్థల యజమానిని రంగంలోకి దింపే ఆలోచనలో బీజేపీ ఉన్నట్లు తెలుస్తోంది.

బీజేపీతో పాటు బయట వ్యక్తులు సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఇప్పటికే ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తవుతున్న అభ్యర్థి తనకు సంఘం నుంచి సీటు ఖరారు కాకపోవడంతో బీజేపీతో టచ్‌లో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

త్రిసభ్య కమిటీ ఏర్పాటు..

ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి సంబంధించి వరంగల్-, నల్గొండ, -ఖమ్మం ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిని టీఎస్‌యూటీఎఫ్, పీఆర్‌టీయూ ఉపాధ్యాయ సంఘాలు ప్రకటించాయి. టీఎస్‌యూటీఎఫ్ నుంచి ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ప్రాతినిధ్యం వహిస్తున్న అలుగుబెల్లి నర్సిరెడ్డినే మళ్లీ బరిలోకి దింపుతున్నట్లు ఆ సంఘం ప్రకటించింది. పీఆర్‌టీయూ నుంచి శ్రీపాల్‌రెడ్డిని ప్రకటించారు.

ఈ స్థానంతో పాటు కరీంనగర్, -మెదక్, -ఆదిలాబాద్-, నిజామాబాద్ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా వంగా మహేందర్‌రెడ్డిని పీఆర్‌టీయూ ప్రకటించింది. కీలకమైన సంఘాలు ముందస్తుగానే తమ అభ్యర్థులను ప్రకటించుకున్నాయి. బీజేపీ అనుబంధ ఉపాధ్యాయ సంఘమైన తపస్ ఇంకా అభ్యర్థులను ప్రకటించలేదు. త్వరగా అభ్యర్థులను ఖరారు చేసే పనిలో కమలం పార్టీ పడింది.

ఇందుకోసం ముగ్గురు సభ్యులతో కమిటీని వేసింది. మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ప్రేమ్ సింగ్ రాథోడ్, ప్రేమ్‌రాజ్ యాదవ్‌లతో కమిటీని నియమించింది. ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న ప్రాంతాల జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలతో కమిటీ సమావేశమైంది.

వచ్చిన దరఖాస్తులను పరిశీలించి.. ఆయా జిల్లా నేతల అభిప్రాయాలు తీసుకొని పార్టీ నాయకత్వానికి నివేదిక ఇవ్వనుంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికతో పాటు ఎన్నికల కోసం కూడా కమిటీని వేసింది. కమిటీలో ధర్మపురి అరవింద్, పాల్వాయి హరీశ్‌బాబు, ఏవీఎన్ రెడ్డి, రామచందర్ రావు, ప్రదీప్ కుమార్, కాసం వెంకటేశ్వర్లును నియమించింది.

బలం పెంచుకునేందుకు..

శాసనమండలిలో బలం పెంచుకునేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా ముందుకెళ్తుంది. వచ్చే ఏడాది మార్చి 29తో మూడు ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ కానున్నాయి. అప్పట్లోగా ఈ స్థానాలకు ఎన్నికలు పూర్తి చేసేందుకు ఎలక్షన్ కమిషన్ ప్రక్రియ షురూ చేసింది. త్వరలో ఓటర్ నమోదు ప్రక్రియ ప్రారంభంకానుంది.

దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను కూడా ఎన్నికల కమిషన్ ప్రకటించింది. మెదక్, నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు, ఖమ్మం, వరంగల్, నల్గొండ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానం ఖాళీ కానున్నాయి. దీంతో ఆశావహులు ఓటర్ నమోదుపై దృష్టి కేంద్రీకరించారు.

ఎక్కువ సంఖ్యలో ఓటర్లను నమోదు చేయించి, ఎన్నికల్లో సత్తా చాటాలని ఉవ్విల్లూరుతున్నారు. ప్రస్తుతం శాసనమండ లిలో బీజేపీకి ఒక ఎమ్మెల్సీ ఉండగా.. ఎన్నికలు జరిగే మూడు స్థానాలను కైవసం చేసుకొని బలంపెంచుకోనేందుకు పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్రణాళిక రచిస్తోంది.