calender_icon.png 19 November, 2024 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మహారాష్ట్రపై బీజేపీ నజర్

12-08-2024 12:37:33 AM

  1. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటికే సమాయత్తం
  2. లోక్‌సభ ఎన్నికల ఫలితాలతో అప్రమత్తం
  3. మహిళలను ఆకర్శించేందుకు లాడ్లీ పథకం!
  4. ఎంఐఎంను వాడుకొని ఓట్లు చీల్చే ఎత్తుగడ

ముంబై, ఆగస్టు 11: లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశం దృష్టిని ఆకర్శించబోతున్న మరో ఎన్నిక మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్. లోక్‌సభ లో బీజేపీకి ఊహించని ఎదురుదెబ్బ తగలటంలో దేశంలోని పెద్ద రాష్ట్రాల్లో ఒకటైన మహారాష్ట్రను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరాదని బీజేపీ అధిష్ఠానం బలంగా నిర్ణయించు కొన్నది. అందులో భాగంగానే లోక్‌సభ ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతోపాటు బీజేపీ అగ్ర నాయకత్వమంతా మహారాష్ట్రకు క్యూ కట్టారు. ప్రతిపక్ష నేతలను రాజకీయంగా టార్గెట్ చేస్తూనే వేలకోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేంత మెజారిటీ సాధించలేకపోయింది. ఈసారి సంపూర్ణ మెజారిటీ సాధించి రాష్ట్రాన్ని గుప్పిట పట్టాలన్న కృత నిశ్చయంతో పావులు కదుపుతున్నది. 

ద్విముఖ వ్యూహం

మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉన్నా యి. ప్రస్తుతం అధికారపక్ష బలంగానే ఉన్నా లోక్‌సభ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి సంపూర్ణ ఆధిక్యం సంపాదించింది. మొత్తం 48 సీట్లకు అధికార పక్షం 17 సీట్లు మాత్రమే గెలిచింది. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు వస్తాయేమోన్న భయం బీజేపీ పెద్దలను కలవరపెడుతున్నది. అసెంబ్లీకి అక్టోబర్‌లోనే ఎన్నికలు జరుగుతాయి. దీంతో మహారాష్ట్రపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ప్రతిపక్ష శివసేన (యూబీటీ), ఎన్సీపీ (ఎస్‌పీ), కాంగ్రెస్ కూటమి ఎంవీఐను బలహీనపరుస్తూ, మరోవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల ప్రకటనతో వివిధ వర్గాలను తమవైపు తిప్పుకొనే ద్విముఖ వ్యూహాన్ని అమలుచేయబోతున్నట్టు తెలుస్తున్నది. అందులో భాగంగానే మహిళా ఓటర్లను ఆకర్షించేందుకు లాడ్లీ బెహనా పథకాన్ని ఇటీవల ప్రారంభించింది. ఈ పథకం కింద నిరు పేద కుటుంబాల్లోని ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఆర్థిక సాయం అందిస్తారు. 

పావుగా ఎంఐఎం

ప్రతిపక్షాలను దెబ్బతీసేందుకు మరోసారి ఎంఐఎం పార్టీని వాడుకోవాలన్న ఆలోచన కూడా బీజేపీ వ్యూహంలో ఉన్నట్టు రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. గత ఎన్నికల్లో ముస్లిం ఓట్లను చీల్చటం ద్వారా ప్రతిపక్షాలను ఐఎంఐ తీవ్రంగా దెబ్బతీసింది. యూపీలో నూ అదే పనిచేసింది. ఎంఐఎం గెలువదు.. ప్రతిపక్షాలను గెలువనివ్వదు అనే నినాదం స్థిరపడిపోయింది. మహారాష్ట్రలో దాదాపు 30 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ముస్లిం ఓటుబ్యాంకు గెలుపు ఓటములను నిర్ణయించే స్థాయిలో ఉన్నది. ఈ అన్ని చోట్ల ఎంఐఎం ఒంటరిగా పోటీచేసేలా పరిస్థితులు కల్పిస్తే తమ గెలుపు సులువు అవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. మరోవైపు ఎన్నికలు దగ్గరపడుతున్న వేళ ఎంవీఏలో సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై విబేధాలు పొడసూపినట్టు వార్తలు వస్తున్నాయి. ఈసారి కూడా తానే సీఎం అభ్యర్థిగా ఉంటానని ఉద్ధవ్ ఠాక్రే పట్టుబడుతున్నట్టు సమాచారం. 

అధికార పక్షం (202)

పార్టీ ఎమ్మెల్యేలు

బీజేపీ 102

ఎన్సీపీ 40

శివసేన 38

బీఏవీ 3

పీహెచ్‌జేఎస్పీ 2

ఆర్‌ఎస్పీ 1

జేఎస్‌ఎస్ 1

ఎంఎన్‌ఎస్ 1

ఇతరులు 14

ప్రతిపక్షం (71)

పార్టీ ఎమ్మెల్యేలు

కాంగ్రెస్ 37

శివసేన (యూబీటీ) 16

ఎన్సీపీ (ఎస్‌పీ) 12

ఎస్పీ 2

సీసీఐఎం 1

పీడబ్ల్యూపీఐ 1

ఇతర విపక్షాలు 2

ఎంఐఎం 2

ఖాళీ 15

లోక్‌సభ బలాబలాలు

పార్టీ ఎంపీల

కాంగ్రెస్ 13

బీజేపీ 9

శివసేన (యూబీటీ) 9

ఎన్సీపీ (ఎస్‌పీ) 8

శివసేన 7

ఎన్సీపీ 1

ఇతరులు 1

మొత్తం 48