calender_icon.png 26 February, 2025 | 2:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దల సభలో బీజేపీనే ప్రతిపక్షం

26-02-2025 12:02:21 AM

 మెదక్ ఎంపీ రఘునందన్‌రావు 

సిద్దిపేట, ఫిబ్రవరి 25 (విజయక్రాంతి):  రాష్ట్రంలోని పెద్దల సభలో భారతీయ జనతా పార్టీ నే ప్రతిపక్షంగా బాధ్యత వహిస్తుందని మెదక్ పార్లమెంట్ సభ్యులు రఘునందన్ రావు చెప్పారు మంగళవారం సిద్దిపేట జిల్లా అధ్యక్షులు బైరి శంకర్ అధ్యక్షతన నిర్వహించిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల సమావేశంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. మెదక్ పార్లమెంట్ పరిధిలోని బిఆర్‌ఎస్ నాయకులు ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపికి మద్దతు ఇస్తున్నట్లు తన వ్యక్తిగతంగా సమాచారం ఇచ్చారని వెల్లడించారు.

ఇప్పటివరకు ఉపాధ్యాయ సంఘాల పేరుతో ఎమ్మెల్సీలుగా గెలిచిన వారందరూ అధికార పార్టీ సంకలో చేరారని విమర్శించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో కెసిఆర్, రేవంత్ రెడ్డిలు బిజెపి పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను, ఎంపీలను మాత్రం కొనలేకపోయారని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీలలో గెలిచి అధికార పార్టీలో చేరిన అనేక పార్టీలు ఉన్నప్పటికీ బిజెపి కి అలాంటి దుస్థితి లేదన్నారు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాలలో కాంగ్రెస్, బిఆర్‌ఎస్ ఓటమిని వారే ఒప్పుకున్నారని, అందుకే పార్టీ అభ్యర్థులను ఎన్నికల బరిలో నిలపలేదని చెప్పారు.

ఈ మధ్య బీసీల గురించి మాట్లాడే పార్టీలు వారి పార్టీలో బీసీలకు ఇచ్చిన స్థానం ఏంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి తన మంత్రివర్గంలో బీసీలకు ఇద్దరికి మాత్రమే మంత్రి పదవులు ఇచ్చారని, మైనార్టీలకు మంత్రి పదవి ఇవ్వలేదని విమర్శించారు. కానీ ఒక జిల్లాకు బీసీకి అధ్యక్ష పదవి ఇచ్చిన ఘనత బిజెపి పార్టీకి దక్కిందన్నారు. కేంద్ర ప్రభుత్వంలో బీసీలు, ఎస్సీలు వారి దామాషా ప్రతిపాదికంగానే మంత్రి పదవులు ఇచ్చినట్లు వెల్లడించారు.

కాంగ్రెస్ పార్టీకి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే బీసీ జనాభా ప్రతిపాదికన మంత్రి పదవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇప్పటివరకు గెలిచిన ఏ ఒక్క ఎమ్మెల్సీ తన వేతనాన్ని ప్రభుత్వ పాఠశాల కోసం ఖర్చు చేస్తామని చెప్పిన దాఖలాలు లేవన్నారు. బిజెపి అభ్యర్థులు మాత్రం గెలవగానే వారికి వచ్చే వేతనాన్ని ప్రభుత్వ పాఠశాలల కోసం ఖర్చు చేస్తామంటూ హామీ ఇవ్వడం గొప్ప విషయంగా చెప్పారు. పట్టభద్రులు, ఉపాధ్యాయులు మీ అమూల్యమైన ఓటు బీజేపీ అభ్యర్థులకు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థి డాక్టర్ అంజిరెడ్డి పాల్గొని మాట్లాడారు.