21-03-2025 12:42:37 AM
హైదరాబాద్, మార్చి 20 (విజయక్రాంతి): తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. అదే ఉత్సాహంతో ముందుకు సాగాలని కేంద్ర హోం మంత్రి అమిత్ షా, పార్టీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా దిశానిర్దేశం చేశారు. గురువారం ఢిల్లీలో కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ ఆధ్వర్యంలో తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్సీలు అమిత్ షా, జేపీ నడ్డాను కలిశారు.
కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలను వారు అభినందించారు. పార్టీ నేతలంతా కష్టపడి పనిచేయడం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలుపు సాధ్యమైందని.. ఇకపై ప్రతి ఎన్నికల్లోనూ ఇదే రీతిన కష్టపడాలని అగ్రనేతలు సూచించినట్టు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు, కాంగ్రెస్ ప్రభుత్వ పాలనా వైఫల్యాలను కేంద్ర మంత్రులకు వివరించారని తెలిసింది.
త్వరలోనే నూతన అధ్యక్షుడి నియామకం ఉంటుందని ఈ సందర్భంగా జేపీ నడ్డా పేర్కొన్నట్టు సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పనిచేయాలని... రాష్ట్రానికి కేంద్రం అన్ని విధాలా అండగా ఉంటుందని అమిత్ షా పేర్కొన్నారని సమాచారం.
కేంద్ర మంత్రులను కలిసిన వారిలో ఎంపీలు లక్ష్మణ్, డీకే అరుణ, ధర్మపురి అరవింద్, రఘునందన్ రావు, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, నగేష్, ఎమ్మెల్సీలు కొమరయ్య, అంజి రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుభాష్ తదితరులున్నారు.