కలెక్టరేట్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల నిరసన
ఇబ్రహీంపట్నం, ఫిబ్రవరి 3 (విజయక్రాంతి): తెలంగాణకు నిధులు తేవడంలో బీజేపీ ఎంపీలు విఫలం అయ్యారని, కేంద్ర బడ్జెట్ పూర్తిగా కార్పొరేట్ సంస్థలకు కొమ్ముకాసేలా ఉందని రాష్ట్ర రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి విమర్శించారు. కేంద్ర బడ్జెట్లో బీజేపీ ప్రభుత్వం తెలంగాణ పట్ల చూపిన వివక్షను నిరసిస్తూ సోమవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు చల్లా నరసింహా రెడ్డి అధ్యక్షతన జరిగిన ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న మల్రెడ్డి రాంరెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రాష్ట్రానికి 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నా, కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం వీరి అసమర్థతకు నిదర్శనమని అన్నారు.
ఎన్నికల సమయంలో ఎన్నో హామీలు ఇచ్చిన ఈ ఎంపీలు గెలిచాక రాష్ట్రానికి ఏమాత్రం ఉపయోగం లేదన్నారు. మూసీని ప్రతిష్టాత్మక ప్రాజెక్టుగా అభివృద్ధి చేస్తుండగా, బీజేపీ నాయకులు కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేకపోతున్నారని అన్నారు.
ఈ ధర్నా కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్య నేతలు, వివిధ విభాగాల ప్రతినిధులు, చైర్మన్లు, డైరెక్టర్లు, మహిళా నాయకురాళ్లు, యువజన కాంగ్రెస్ నాయకులు, ఇతర కాంగ్రెస్ శ్రేణులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.