calender_icon.png 26 October, 2024 | 4:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ మహాధర్నా

26-10-2024 02:05:01 AM

  1. సీఎం సవాలుకు సిద్ధం
  2. మూసీ పరీవాహక ప్రాంతంలో నివాసం ఉంటాం
  3. బాధితుల కోసం జైలుకు వెళ్తాం 
  4. హైడ్రా పేరుతో ప్రజలకు నిద్రలేని రాత్రులు
  5. హైడ్రా, మూసీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్
  6. బీజేపీ మూసీ ధర్నాలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి 
  7. మూసీ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతి పెద్ద స్కాం
  8. కేంద్ర మంత్రి బండి సంజయ్

హైదరాబాద్, అక్టోబర్ 25 (విజయక్రాంతి): మూసీ ప్రాజెక్ట్‌ను వ్యతిరేకిస్తున్న వారు మూడు నెలల పాటు మూసీ పరివాహక ప్రాంతాల్లో నివాసం ఉంటే ప్రాజె క్టును విరమించుకుంటానంటూ సీఎం రేవంత్ చేసిన సవాల్‌ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నామని, అక్కడ తాము పేదల ఇళ్లలో నివాసం ఉంటామని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు.

మూసీ ప్రాంతాల్లో పేదల ఇళ్ల కూల్చివేతలకు వ్యతిరేకంగా బీజేపీ ఎంపీ లు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు ఇందిరాపార్క్ వద్ద చేపట్టిన మహాధర్నాలో ఆయన మాట్లాడారు. ఇంతవరకు  కొత్త ఇండ్లను ఇవ్వకపోగా ఏండ్లుగా నివసిస్తున్న నిరుపేదల ఇండ్లను కూల్చే ప్రయ త్నం చేస్తోందని రేవంత్‌రెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు.

అధికారంలోకి వచ్చేందుకు ప్రజలను సోనియా, రాహుల్, రేవంత్ మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేశారని ఆరోపించారు. బీఆర్‌ఎస్ దారిలోనే రేవంత్ రెడ్డి వెళ్తున్నారని ఆరోపించారు. మూసీ ప్రక్షాళనకు తాము వ్యతిరేకం కాదని.. కానీ పేదల ఇండ్లను కూలిస్తే మాత్రం ఊరుకోబోమని హెచ్చరించారు.

మూసీకి ఇరువైపులా రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేసి సుందరీకరణ చేసుకోవాలని సూచించారు. మూసీ పక్కన ఉండలేకపోతున్నామని ప్రభుత్వానికి మూసీ బాధి తులు ఎవరైనా చెప్పారా, వారి ఇండ్లను కూల్చమన్నారా అని ప్రశ్నించారు. మూసీ బాధితులకు  బీజేపీ అండగా ఉండి పోరాడుతుందని తెలిపారు.

బాధితుల కోసం అవసరమైతే చంచల్ గూడ జైలుకు అయినా, చర్లపల్లి జైలుకు అయినా వెళ్లేందుకు తాము సిద్ధమని చెప్పారు. రేవంత్ రెడ్డి  ప్రయత్నాలను అడ్డుకుని పేదల కన్నీళ్లు తూడుస్తామని భరోసానిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దాష్ట్ట్టికానికి ఓ వ్యక్తి గుండెపోటుతో చనిపోయారని పేర్కొన్నారు.

డ్రైనేజీ వ్యవస్థ లేకుండా మూసీ సుందరీకరణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. రేవంత్‌కు పేద ప్రజలు ముఖ్యమా... మూసీ సుందరీకరణ ముఖ్యమో తేల్చుకోవాలన్నారు. తామైతే ముందు పేదలకు మౌలిక సదుపాయాలు కల్పించి తర్వాత సుందరీకరణ చేసేవారిమని తెలిపారు. ఆర్థిక వనరులు ఎలా  సమకూర్చుకుంటారో కూడా తెలియని స్థితిలో సర్కారు ఉందన్నారు. 

అతి పెద్ద స్కాం: బండి సంజయ్

 మూసీ సుందరీకరణ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద స్కాం అని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.కిలోమీటర్‌కు రూ. 2 వేల కోట్ల ఖర్చు ఎందుకవుతుందని ప్రశ్నించారు. సోనియా అల్లుడి కోసమే మూసీ డ్రామాలాడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ దోపిడీని అడ్డుకుని తీరుతామని స్పష్టం చేశారు.

మూసీని థేమ్స్ మాదిరిగా మారుస్తామని సీఎం అంటే.. మంత్రులేమో సియోల్‌లోని చంగ్ ఏ చంగ్ నదిలా మారుస్తామంటున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ పాలనలో రూ.16,634 కోట్లతో మూసీ సుందరీకరణకు డ్రామా ఆడారని, కానీ ఒక్క అడుగు ముందుకు పడలేదన్నారు. తెలంగాణ సొమ్ము కర్నాటక, మహారాష్ర్ట, పంజాబ్ పాలవుతుందని ఆరోపించారు.

మూసీ డ్రైనేజీ నీటితో విషంలా  మారడానికి బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలే కారణమన్నారు. మూసీ ప్రక్షాళనను ఓ జోక్‌గా అభివర్ణించారు. మూసీని అడ్డుపెట్టుకుని కబ్జా చేసిన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, ఎంఐఎం నేతల భవనాల జోలికి పోయే దమ్ముందా అని సీఎంను ప్రశ్నించారు.

పేదల ఇండ్లపైకి బుల్డోజర్లు రావాలంటే తమను దాటిపోవాలని హెచ్చరించారు. మూసీ ప్రక్షాళనకు సబర్మతి నది, నమామి గంగే ప్రాజెక్టుతో పోలికా అని ఎద్దేవా చేశారు. సబర్మతికి రూ.7 వేల కోట్ల ఖర్చు,  నమామి గంగేకు రూ.40వేల కోట్లు మాత్రమే ఖర్చు అయ్యాయని మూసీకి లక్షన్నర కోట్లు ఎందుకు ఖర్చు చేస్తున్నారని ప్రశ్నించారు.  

హైడ్రా తోక మడిచింది: ఎంపీ ఈటల

బీజేపీ ఆందోళనలతోనే హైడ్రా తోక ముడిచిందని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. అబద్ధాలకు మారుపేరు రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మూసీని ఖాళీ చేయకపోతే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వబోమని బెదిరింపులకు గురిచేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు40 ఏండ్ల క్రితమే ప్రభుత్వం ఇండ్ల పట్టాలిచ్చిందన్నారు. మూసీ ప్రక్షాళనకు ఇండ్ల కూల్చివేతలకు ఏం సంబంధమో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు.  

ప్రజలు ఒప్పుకుంటే సహకరిస్తాం: ఏలేటి 

మూసీ ప్రక్షాళనకు అక్కడున్న ప్రజలు ఒక్కరు ఒప్పుకున్నా తాము ప్రభుత్వానికి సహకరిస్తామని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ లీడర్ల కమీషన్‌ల కోసం పేదలను రోడ్డున పడేస్తామంటే ఎట్టి పరిస్థితుల్లో ఊరుకోబోమని హెచ్చరించారు. సీఎం రేవంత్ రెడ్డి తమతో కలిసి మూసీ ప్రాంత పరిశీలనకు రావాలని సూచించారు.