calender_icon.png 25 October, 2024 | 2:52 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. సర్కార్‌కి కేంద్రమంత్రి వార్నింగ్

25-10-2024 12:46:26 PM

చేయి చేసిన కీడు.. మూసీ బాధితులకు బీజేపీ తోడు

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూల్చివేతలు

మూసీ బాధితులను కలిశాం.. వారి కష్టాలు తెలుసుకున్నాం

మూసీలో ఇళ్లు కూలగొట్టి ఏం చేస్తారో రేవంత్ రెడ్డి చెప్పాలి

హైదరాబాద్: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ధర్నా చౌక్ వద్ద 'చేయి చేసిన కీడు.. మూసీ బాధితులకు బీజేపీ తోడు' పేరుతో మహా ధర్నా చేస్తోంది. మూసీ పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లు కూల్చవద్దని డిమాండ్ చేస్తూ మహా ధర్నా జరుగుతోంది. మహా ధర్నాలో బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు పాల్గొన్నారు.  ఈ సందర్భంగా కేంద్రమంతి కిషన్ రెడ్డి మాట్లాడుతూ...  కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కూల్చివేతలు మొదలుపెట్టిందన్నారు. ఇటుకపై ఇటుక పేర్చి కట్టుకున్న ఇళ్లను కూల్చుతున్నారని కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. హైడ్రా చర్యలతో పేదలు, మధ్యతరగతి ప్రజలు నిద్రలేని రాత్తులు గడుపుతున్నారని మండిపడ్డారు. ఆరు గ్యారంటీలు, 400 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు.

బీఆర్ఎస్ విధానాలనే కాంగ్రెస్ ప్రభుత్వం కొనసాగిస్తోందని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మూసీ బాధితులను కలిశాం.. వారి కష్టాలు తెలుసుకున్నాం.. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదలకు అండగా నిలుస్తామని కిషన్ రెడ్డి హామీ ఇచ్చారు. మూసీలోని పేదల ఇళ్లు కూలగొట్టాలనే ఆలోచన మానుకోవాలని ప్రభుత్వాన్ని కేంద్రమంత్రి కోరారు. మూసీకి రెండు వైపులా రిటైనింగ్ వాల్ కట్టాలని ఆయన డిమాండ్ చేశారు. మూసీలో ఇళ్లు కూలగొట్టి ఏం చేస్తారో రేవంత్ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లోని పేదల ఇళ్లు కూలిస్తే ఊరుకోం.. మూసీలో ఉన్నవారు ధనవంతులు కాదు.. వారు కట్టుకున్నవి విల్లాలు కాదు.. అనేక ఏళ్లపాటు శ్రమించి పేదలు ఇళ్లు కట్టుకున్నారని చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతం గురించి రేవంత్ రెడ్డికి తెలుసా..?, మూసీ నుంచి వాసన వస్తోందని మీకు ఎవరైనా ఫిర్యాదు చేశారా..? అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.