calender_icon.png 14 October, 2024 | 6:56 AM

బీసీల వైపు బీజేపీ చూపు!

14-10-2024 04:09:51 AM

తెలంగాణలో పట్టు కోసం కమలనాథుల ఎత్తులు

బీసీనేత కృష్ణయ్యను పార్టీలో చేర్చుకునేందుకు ప్రయత్నాలు 

స్టేట్ చీఫ్ కూడా బీసీకి ఇచ్చే యోజనలో అధినాయకత్వం!

హైదరాబాద్, అక్టోబర్ 13 (విజయక్రాంతి): తెలంగాణలో ఎనిమిది ఎంపీ సీట్లను కైవసం చేసుకొని సత్తా చాటిన బీజేపీ.. ఇప్పడు మరింత బలపడేందుకు ప్రయత్నిస్తోంది. అందులో భాగంగా ఆ పార్టీ నేతలు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అంశంతో బీజేపీ మాదిగ సామాజికవర్గానికి దగ్గరైంది.

మందకృష్ణ మాదిగ లాంటి బలమైన సామాజిక నేతను తమ వైపు తిప్పుకొని తన మాస్టర్‌మైండ్‌ను చాటుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రధాన ఓటు బ్యాంకు అయిన బీసీలకు కూడా చేరువయ్యేందుకు బీజేపీ ఎత్తులు వేస్తోంది. ఈ మేరకు ఆ పార్టీ పెద్దలు పావులు కదుపుతున్నారు.

ఇటీవల తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్యను కమలంలోకి ఆహ్వానించేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయన కూడా చేరికపై సుముఖంగానే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్ల కల్పనే లక్ష్యంగా పోరాడుతున్న కృష్ణయ్య..

ఇంకా 4 ఏళ్ల పదవీ కాలం ఉన్నప్పటికీ ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఈ తరుణంలోనే ఆయన్ను రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీలోకి తీసుకువచ్చేందుకు హస్తం నేతలు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దేశవ్యాప్తంగా బీసీ ఉద్యమానికి ఆర్ కృష్ణయ్య నాయకత్వం వహించారు.

50 ఏళ్లుగా బీసీల విద్య, హాస్టళ్లు, గురుకులాలు, స్కాలర్‌షిప్పులు, ఫీజు రీయెంబర్స్‌మెంట్ వంటి వాటినెన్నో ఆయన పోరాటంతోనే సాధించారు. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ల సాధన, మండల్ ఉద్యమానికి నాయకత్వం వంటి ఎన్నో పోరాటాల ద్వారా బీసీల హక్కుల కోసం ఆయన కృషి చేశారు.

ఈ నేపథ్యంలోనే బీసీలకు సంబంధించిన ప్రధాన డిమాండ్లను నెరవేరుస్తూ కృష్ణయ్యను బీజేపీలోకి తీసుకుంటే పార్టీకి మరింత కలిసివస్తుందని బీజేపీ నేతలు భావిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆ పార్టీ హై కమాండ్ కృష్ణయ్యతో టచ్‌లో ఉన్నట్లుగా తెలుస్తోంది.

ఆయనకు ఒడిశా నుంచి రాజ్యసభ పదవిని కూడా ఆఫర్ చేయడంతో పాటు జాతీయ స్థాయిలో ముఖ్యమైన పదవిని కూడా కట్టబెట్టేందుకు సిద్ధమైనట్లు సమాచారం. బీసీలను అన్నీ పార్టీలు వాడుకొని వదిలేశాయని అందుకే జాగ్రత్తగా అడుగులు వేయాలని ఆయన సన్నిహితులు సలహా ఇచ్చిన నేపథ్యంలో కృష్ణయ్య ఆచితూచీ అడుగులు వేస్తున్నారు.

రాష్ట్రంలో బలంగా ఉన్న బీసీ వాదాన్ని కృష్ణయ్యను పార్టీలోకి చేర్చుకోవడం ద్వారా తమకు అనుకూలంగా మార్చుకొని వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావాలని బీజేపీ ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించిందని అంటున్నారు. తెలంగాణలో గెలుపుతో దక్షిణాదిలో పాగా వేయొచ్చని ఆ పార్టీ భావిస్తోంది.

అండగా ఉన్నామని చాటేందుకు...

తెలంగాణలో బీసీలకు అండగా ఉన్నామని చాటేందుకు బీజేపీ అన్నీ అ వకాశాలను వినియోగించుకునేందుకు సిద్ధమైంది. అందులో భాగంగా ఖాళీ గా ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానాన్ని కూడా బీసీలతోనే భర్తీ చేసేందుకు పార్టీ ముఖ్య నేతలు నిర్ణయించినట్లుగా సమాచారం.

రాష్ట్రంలో బలమైన ఓటు బ్యాంకుగా ఉన్న బీసీలను నమ్ముకుంటే పార్టీకి భవిష్యత్తు ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పేర్కొన్నట్లు సమాచారం. అందుకే త్వరలో భర్తీ చేయబోయ్యే రాష్ట్ర బీజేపీ చీఫ్ పదవికి బీసీ నేతకు ఛాన్స్ ఇవ్వాలని పార్టీ నేతలు యోచిస్తున్నారు.