calender_icon.png 1 November, 2024 | 6:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ నేతలు గ్రాఫిక్స్ లీడర్లు

20-04-2024 12:18:22 AM

l రోజురోజుకు ఎన్‌డీఏ హవా తగ్గుతోంది

l ఇండియా కూటమి బలపడుతోంది 

l బీఆర్‌ఎస్‌పై గేమ్ ప్రారంభమైంది 

l టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి

హైదరాబాద్, ఏప్రిల్ 15(విజయక్రాంతి): దేశంలో ఎన్‌డీఏ కూటమి ప్రభావం రోజురోజుకు తగ్గుతోందని, ఇండియా కూటమి పెరుగుతోందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చేపట్టిన జోడో యాత్ర వల్లే ఇండియా కూటమి గ్రాఫ్ పెరిగిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రావడం, రాహుల్‌గాంధీ ప్రధాని కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. బీజేపీ నేతల మాటలకు విలువ లేదని, వాళ్లు గ్రాఫిక్స్ లీడర్లని ఎద్దేవా చేశారు.

గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో కేసీఆర్ గేమ్ ఆడితే.. అధికారంలో ఉన్న తాము పావులు కదపలేమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలకు కౌంటర్‌గానే సీఎం రేవంత్‌రెడ్డి రియాక్షన్  తీసుకుంటున్నారని తెలిపారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలున్నాయని, బీజేపీ చరిత్ర 40 ఏళ్లు మాత్రమేనని జగ్గారెడ్డి వివరించారు. బీజేపీ నాయకులే దేశ భక్తులని డబ్బా కొట్టుకోవడం సరికాదని, అసలైన దేశ భక్తులు రాహుల్‌గాంధీ కుటుంబమన్నారు.

గాంధీ కుటుంబం సంపద స్వాతంత్య్ర ఉద్యమం కోసం ఖర్చు చేశారన్నారు. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి ఎంత మంది ఎమ్మెల్యేలు వస్తారని మీడియా ప్రశ్నించగా.. ఎన్నికల తర్వాత తెలుస్తుందన్నారు. అయినా ఎమ్మెల్యేల చేరిక తన పరిధిలోని అంశం కాదని జగ్గారెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ ఆలోచనతో తమ ప్రభుత్వం కూలిపోతుందనే విషయం తెలియదు కానీ, ఆయన వ్యూహాన్ని తిప్పి కొట్టే ఆలోచన తమ వద్ద ఉందన్నారు. ఐదేళ్లు ప్రజలను ఎలా మెప్పించాలనే ఆలోచనలో ఉన్నామన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వంద మంది ఉన్న  కౌరవులను ఐదుగురు పాండవులు కూల్చేశారని తెలిపారు.