14-04-2025 01:01:51 AM
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్
కరీంనగర్, ఏప్రిల్ 13 (విజయ క్రాంతి): అణగారిన వర్గాల్లో వెలుగులు నింపడంతోపాటు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా ఫరిఢవిల్లేలా రాజ్యాంగాన్ని రచించిన భారత అంబేద్కర్ ను అడుగడుగున అవమానించిన చమైన చరిత్ర కాంగ్రెస్ దేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు.
అంబేద్కర్ జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం బిజెపి ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో కేంద్రమంత్రి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ఈరోజు కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియం వద్దకు వచ్చారు. అంబేద్కర్ చిత్రపటాలు, కాషాయ జెండాలతో కార్యకర్తలు నిర్వహించిన బైక్ ర్యాలీలో బండి సంజ య్ పాల్గొన్నారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని మంచి నీళ్లతో శుద్ధి చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబయికి తరలించిన కాంగ్రెస్ పార్టీ... ఆ తరలింపుకయ్యే విమాన ఛార్జీలు చెల్లించాలంటూ అంబేద్కర్ సతీమణికి బిల్లులు పంపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ దేనని విమర్శించారు. దేశవ్యాప్తంగా అంబేద్కర్ జయంతి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా అంబేద్కర్ విగ్రహాలను శుద్ది చేయడమే అంబేద్కర్ గొప్ప చరిత్రను భావితరాలకు తెలియజేయడమేనని అన్నారు.
మనలోని అజ్ఝానాన్ని పారదోలి వెలుగులు నింపుకునేలా చేయడమే, ఆయన ఆశయాలను కొనసాగించడమేనని అన్నారు.అణగారిన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహనీయుడు అంబేద్కర్ అని, అంటరాని తనాన్ని పాతాళానికి తొక్కి కుల రక్కసిని కూకటివేళ్లతో పెకలించేందుకు తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మేధావి, భారత ప్రజాస్వామ్యానికి దిక్సూచి, అణగారినవర్గాల ఆత్మగౌరవ పతాకం అంబేద్కర్ అని అన్నారు.
అంబేద్కర్ ఆశయాల సాధనకు తూ.చ తప్పకుండా క్రుషి చేస్తున్న ప్రభుత్వం నరేంద్రమోదీదేనని అన్నారు. భావితరాలకు అంబేద్కర్ చరిత్ర తెలిసేలా పంచ తీర్థాలను ఏర్పాటు చేసిందని, దళితుడైన రామ్ నాథ్ కోవింద్, ఆదివాసీ ముర్ముకు రాష్ట్రపతి పదవితో గౌరవించిందన్నారు. 12 మంది దళితులకు, 27 మంది ఓబీసీలకు, 8 మంది మహిళలకు కేబినెట్ లో చోటు కల్పించిందన్నారు.
జాతీయ బీసీ కమిషన్ కు రాజ్యాంగ బద్ధత కల్పించిందని,ఏటా 1.25 లక్షల మంది దళితులను పారిశ్రామికవేత్తలుగా మారుస్తోందన్నారు. బీజేపీ క్రుషితోనే అంబేద్కర్ కు భారతరత్న అవార్డుతో గౌరవమిచ్చిందని, అంబేద్కర్ స్మారక స్టాంపు, బిల్లుల విడుదల, పార్లమెంటులో అంబేద్కర్ చిత్రపటం, సుప్రీంకోర్టు, న్యాయమంత్రిత్వ శాఖలో విగ్రహాల ఏర్పాటు చేసిన ఘనత బీజేపీదేనని అన్నారు.
2023లో నారీ శక్తి వందన్ బిల్లు (33% రిజర్వేషన్లు) ప్రవేశపెట్టడం... ఆర్టికల్ 370 రద్దు చేయడం బీజేపీ ఘనతేనని అన్నారు. కానీ అంబేద్కర్ ను కాంగ్రెస్ పార్టీ అడుగడుగునా అవమానించిందని, 1951లో హిందూకోడ్ బిల్లు, సామాజిక న్యాయ సాధికారత అంశాలపై అంబేద్కర్ అభిప్రాయాలను నెహ్రూ వ్యతిరేకిస్తే మనస్తాపానికి గురై న్యాయ శాఖ మంత్రి పదవికి అంబేద్కర్ రాజీనామా చేశారని అన్నారు.
ఆ తరువాత 1952 ఎన్నికల్లో కమ్యూనిస్టులతో కలిసి, 1954 ఉప ఎన్నికల్లో స్వయంగా అభ్యర్థిని నిలబెట్టి అంబేద్కర్ ను ఓడించిన నీచమైన చరిత్ర కాంగ్రెస్ దని అన్నారు. అంతేగాకుండా అంబేద్కర్ను చరిత్రను తగ్గించే కుట్ర చేసిందని, భారతరత్న ఇవ్వకుండా అవమానించిందని, అంబేద్కర్ను ఓడించినోళ్లకు పద్మభూషణ్ ఇచ్చిందన్నారు. ఆఖరికి అంబేద్కర్ అంత్యక్రియలు ఢిల్లీలో జరగనీయకుండా ముంబయికి తరలిస్తే...విమాన చార్జీలను చెల్లించాల్సిందిగా అంబేద్కర్ భార్యకు రశీదు పంపిన నీచాతినీచమైన చరిత్ర కాంగ్రెస్ దని బండి సంజయ్ కుమార్ అన్నారు.