శివసేన యూబీటీ అధినేత ఉద్ధవ్
ముంబై, ఆగస్టు 3: బీజేపీ పవర్ జిహాద్‌కు పాల్పడుతూ దేశంలో రాజకీయాలను కలుషితం చేస్తున్నదని శివసేన (యూబీటీ) అధినేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే విమర్శించారు. దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలను చీల్చి, దొడ్డిదారిన అధికారాన్ని హస్తగతం చేసుకొన్నదని మండిపడ్డారు. పుణెలో పార్టీ కార్యకర్తల సమావేశంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మధ్యయుగ ఆఫ్గాన్ పాలకుడు అహ్మద్‌షా అబ్దాలీకి రాజకీయ వారసుడు అని తీవ్ర విమర్శలు గుప్పించారు. మధ్యయుగంలో సగం భారత భూభాగాన్ని శాసించిన మరాఠాలను పానిపట్ యుద్ధంలో అబ్దాలీ ఓడించి మరాఠా సామ్రాజ్యాన్ని కూలదోశాడు. ఇటీవల మహారాష్ట్రలో పర్యటించిన అమిత్ షా విపక్ష కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు. ‘ఔరంగజేబు ఫ్యాన్స్ క్లబ్‌కు ఉద్ధవ్ ఠాక్రే నాయకుడు’ అని విమర్శించారు. దీంతో అమిత్ షాను కూడా ఠాక్రే అదే రీతిలో ఏకి పారేశారు. మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేపై కూడా ఉద్ధవ్ విమర్శలు గుప్పించారు.