calender_icon.png 15 November, 2024 | 9:44 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీది విభజన రాజకీయం

10-11-2024 02:02:05 AM

  1. ద్వేషానికి వ్యతిరేకంగా మేం ప్రేమ దుకాణం తెరుస్తాం
  2. జార్ఖండ్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ

జార్ఖండ్, నవంబర్ 9: దేశ వ్యాప్తంగా బీజేపీ నిర్మించిన ద్వేషం అనే మార్కెట్‌లో తాము ప్రేమ దుకాణం తెరుస్తామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. జార్ఖండ్ ఎన్నికల వేళ లోహర్‌దాగాలో శనివారం జరిగిన బహిరంగ సభలో బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు. 

ఒక మతాన్ని మరో మతానికి వ్యతిరేకంగా ఉసిగొల్పుతోందని ఆరోపించారు. ప్రాంతాల వారీగా ప్రజలను విభజించడమే బీజేపీ వ్యూహమని దుయ్యబట్టారు. హర్యానాలో ఇటీవల ఎన్నికల సమయంలో చోటు చేసుకున్న ఉద్రిక్తతలను గుర్తు చేశారు.

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇటీవల బీజేపీ విజయం సాధించి అక్కడ జాట్ వర్సెస్ నాన్ జాట్‌ల గురించి మాట్లాడుతుందని విమర్శించారు. అలాగే మణిపూర్‌లో అశాంతిని రేపి ఇప్పుడు శాంతి స్థాపన గురించి మాట్లాడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది ముమ్మాటికి బీజేపీ ద్వంద్వ వైఖరికి అద్దం పడుతోంది అని రాహుల్ సెటైర్లు వేశారు.  

భారత్ జోడోనే మా ప్రధాన మోటో..

ఈ సందర్భంగా రాహుల్ తాను కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు చేపట్టిన జోడో యాత్ర గురించి ప్రస్తావించారు. యాత్రలో తాను అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యానట్లు తెలిపారు. ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నట్టు చెప్పారు. ప్రజలంతా భారత్ ఐక్యతను కోరుకుంటున్నారని పేర్కొన్నారు. చివరగా బీజేపీ నిర్మించిన ద్వేషం అనే మార్కెట్‌లో తాము ప్రేమ దుకాణం తెరవనున్నట్టు చెప్పారు.

మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పించేందుకు బీసీ, ఎస్సీ, ఎస్టీ లకు అన్యాయం చేయాలని చూస్తోందని బీజేపీ విమర్శిస్తున్న వేళ రాహుల్ ఆ విషయంపై స్పందించారు. జార్ఖండ్‌లో తాము అధికారంలోకి వస్తే రిజర్వేషన్లపై ఉన్న శాతం పరిమితిని ఎత్తేస్తామన్నారు. కులగణన చేసి జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచుతామన్నారు. కాగా, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో జేఎన్‌ఎం, కాంగ్రెస్, ఆర్‌జేడీ, సీపీఐ కలిసి పోటీచేయనున్నాయి.

జేఎన్‌ఎం 43 స్థానాల్లో పోటీ చేయనుండగా, కాంగ్రెస్ పార్టీ 30 స్థానాల్లో తమ అభ్యర్థులను బరిలో నిలిపింది. మరో మిత్రపక్షం ఆర్‌జేడీ ఆరు స్థానాల్లో పోటీ చేస్తోంది. మరో 3 స్థానాల్లో వామపక్షాలు బరిలో ఉన్నాయి. మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో నవంబర్ 13, 20 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరిగుతాయి. ఎన్నికల ఫలితాలు నవంబర్ 23న వెలువడుతాయి.

పాల్ఘర్‌లో రూ.3.7 కోట్లు సీజ్

ముంబై, నవంబర్ 9: మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల తేదీ(నవంబర్ 20) దగ్గర పడుతున్న కొద్దీ భారీ మొత్తంలో నగదు పట్టుబడుతోంది. రాష్ట్రంలోని పాల్ఘర్ జిల్లాలో శుక్రవారం ఓ వ్యాన్‌లో తరలిస్తున్న రూ.3.70 కోట్ల నగదదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వాహనం నవీ ముంబై నుంఇ విక్రమ్‌ఘర్‌కు వెళ్తోంది.

అయితే సంబంధిత నగదును ఏటీఎం రీఫిల్ కోసం తీసుకెళ్తున్నట్లు డ్రైవర్ తెలిపినప్పటికీ అతడి వద్ద సరైన డాక్యుమెంట్లు లేకపోవడంతో పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. ఇన్‌స్పెక్టర్ దత్తా కింద్రే మాట్లాడుతూ.. జిల్లా గుండా వెళ్తున్న వాహనంలో రూ.3 కోట్ల 70లక్షల నగదు లభించిందని..

నగదు రవాణాకు సంబంధించి అవసరమైన పత్రాలను అందించడంలో డ్రైవర్, సెక్యూరిటీ సిబ్బంది విఫలయ్యారన్నారు. నగదును స్వాధీనం చేసుకున్నామని ఆదాయపు పన్ను శాఖతో పాటు ఎన్నికల అధికారులకు సమాచారం అదించామని సీఐ తెలిపారు. వాహనంలో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.