24-03-2025 12:54:50 AM
రాజేంద్ర నగర్, మార్చి 23, (విజయక్రాంతి) : రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందని, బిజెపి ప్రభుత్వం రాజ్యాంగ సవరణ పేరుతో రాజ్యాంగాన్ని అంతం చేసే కుట్ర చేస్తుందని టిపిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఆదివారం రాజేంద్రనగర్ పరిధిలోని అరంఘర్ లో టి యు ఎఫ్ ఐ డిసి చైర్మన్, రంగారెడ్డి జిల్లా డిసిసి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి ఆధ్వర్యంలో జై బాపు జై భీమ్, జె సంవిధాన్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహేష్ కుమార్ గౌడ్ తో పాటు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఏఐసీసీ ఆదేశాల మేరకు రంగారెడ్డి జిల్లాలో బాపు జై భీమ్, జె సమవిధాన్ అభియాన్ సన్నాహక సమావేశాన్ని పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం దేశంలో అంబేద్కర్ ను అడుగడుగునా అవమాన పరుస్తుందని ధ్వజమెత్తారు. రాజ్యాంగాన్ని కించపరచిన అమిత్ షాను వెంటనే బర్తరఫ్ చేయాలని పలుమార్లు డిమాండ్ చేసినా కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెడుతుందని పేర్కొన్నారు. కొత్త సవరణల పేరుతో బిజెపి రాజ్యాంగాన్ని తీసుకురావడానికి మోడీ ప్రయత్నిస్తున్నారని రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పై ఉందని రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడానికి ఏఐసీసీ పెద్ద ఎత్తున పాదయాత్రలు చేపట్టబోతుందన్నారు.
బిజెపి ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల పై చిన్న చూపు చూస్తుందన్నారు. చెన్నైలో జరిగిన డిలిమిటేషన్ కార్యక్రమంలో తెలంగాణకు అన్యాయం జరుగితే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడం జరిగిందన్నారు. డీలిమిటేషన్ పేరుతో రాష్ట్రంలో ఎంపీ సీట్లను తగ్గించడానికి ప్రయత్నం చేస్తే తగిన గుణపాఠం చెప్తామని రాష్ట్ర హక్కుల పరిరక్షణ ఏ పోరాటమైన చేయడానికి సిద్ధమని హెచ్చరించారు. డీలిమిటేషన్ కి తాము వ్యతిరేకమని పేర్కొన్నారు.
రాష్ట్రానికి ఎలాంటి నష్టం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని త్వరలోనే నగరంలో బిజెపి విధానాలకు వ్యతిరేకంగా భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నామని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని వారికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. కష్టపడిన వారికి కాస్త ఆలస్యమైన తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. ఎవరు అధైర్యపడొద్దని, అండగా ఉంటామని భరోసా కల్పించారు.
త్వరలోనే రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవిని కేటాయిస్తామని రంగారెడ్డి జిల్లా పై ప్రత్యేక దృష్టి పెడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో గ్రామ, మున్సిపల్ స్థాయిలో కష్టపడి తమ సత్తా ఏంటో చూపించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్పర్సన్ తీగల అనిత రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు సానం శ్రీనివాస్ గౌడ్, నాయకులు ధనంజయ్, రంగారెడ్డి జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాగేందర్ రెడ్డి, ప్రజా ప్రతినిధులు , మున్సిపల్ చైర్మన్ లు, ప్రెసిడెంట్ లు, తదితరులు పాల్గొన్నారు.