20-04-2025 12:49:01 AM
పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు
హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాంతి): గతంలో జనతా పార్టీ చేసిన తప్పుడు పనులనే ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం కూడా చేస్తోందని పీసీసీ మాజీ అధ్యక్షుడు వి. హనుమంతరావు విమర్శించారు. స్వాతంత్య్ర పోరాటం సమయంలో బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా ‘నేషనల్ హెరాల్డ్’ ప్రతికను స్వాతంత్య్ర సమరయోధులు నడిపారని, ఈ పత్రికను ప్రజలందరు విశ్వసించారన్నారు.
శనివారం గాంధీభవన్‌లో వీహెచ్ మీడియాతో మాట్లాడారు. ఈ పత్రిక విషయంలో మనీలాండరింగ్ జరిగిందని సోనియా, రాహుల్ గాంధీలపై కేసులు పెట్టడం ఎంత వరకు సమంజసమని నిలదీశారు. బీజేపీని ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చిందని, వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీనే అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కుల గణన జరిగిందని.. ఇది దేశానికి రోల్ మాడల్ అన్నారు. బీసీలకు 42 శాతం విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో రిజర్వేషన్లు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుల గణన చేసిందన్నారు. బీసీ కుల గణన చేపట్టిన సీఎం రేవంత్‌కు కృతజ్ఞతలు చెప్పేందుకు బీసీ కుల సంఘాలన్ని ముందుకు రావాలని పిలుపునిచ్చారు.