calender_icon.png 5 March, 2025 | 3:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ అంటేనే అమ్మకం!

05-03-2025 12:48:35 AM

  1. ఆదిలాబాద్ సీసీఐ ఫ్యాక్టరీని తుక్కుగా అమ్మేందుకు కుట్ర
  2. మోదీ తలుచుకుంటే ఫ్యాక్టరీ తెరుచుకోదా?
  3. పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు దండుకుని ఇప్పుడేమో వంచన
  4. నిర్ణయం వెనక్కితీసుకోకపోతే కార్మికులతో కలిసి పోరాటం
  5. మాజీమంత్రి కేటీఆర్

హైదరాబాద్, మార్చి 4 (విజయక్రాంతి): ఆదిలాబాద్‌లోని సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఫ్యాక్టరీని తుక్కు కింద తెగనమ్మేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభు త్వం సిద్ధం కావడం దుర్మార్గమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు.

సీసీఐని పునఃప్రారంభిస్తామని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చి, ఓట్లు దండుకున్న బీజేపీ, ఇప్పుడు ఆ సంస్థను స్క్రాప్ కింద అమ్మాలనుకోవడం ప్రజలను వంచించడమేనని విమర్శించారు. “బీజేపీ అంటే నమ్మకం కాదు.. అమ్మకం” అని కేటీఆర్ ఆరోపించారు.

ఆదిలాబాద్ ప్రజలకు ఆయువుపట్టులాంటి సీసీఐని తిరిగి ప్రారంభించకుండా ఆ సంస్థ ఆస్తులను వేలం వేసేం దుకు సిద్ధమవడం మోదీ ప్రభుత్వ కుటిలత్వానికి పరాకాష్ట అని కేటీఆర్ మంగళవారం ప్రకటనలో తెలిపారు. 772 ఎకరాల భూమి, 170 ఎకరాల టౌన్‌షిప్, 48 మిలియన్ టన్నుల లైమ్‌స్టోన్ నిల్వలతో సకల వనరులు కలిగిన ఈ సంస్థను అంగడి సరుకుగా మార్చిన పాపం మోదీ ప్రభుత్వానిదేనని మండిపడ్డారు.

సీసీఐకి చెందిన ఎంతో విలువైన యంత్రపరికరాలను పాత ఇను ప సామాన్ల కింద లెక్కకట్టి ఆన్‌లైన్‌లో అమ్మడానికి టెండ ర్లు పిలవడం బీజీపీ ప్రభుత్వ దగుల్బాజీతనానికి నిదర్శనమన్నారు. సీసీఐను తిరిగి ప్రారంభిస్తే  ఆదిలాబాద్‌లోని వేలాదిమంది యువతకు ఉపాధి దొరుకుతుందన్న ఉద్దేశంతో ప్రధానితో పలుమార్లు ఈ విషయంపై నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చర్చలు జరిపారన్నారు.

అంతేగాక తానే స్వయంగా కేంద్రమంత్రులైన నిర్మలా సీతారామన్,  మహేంద్రనాథ్ పాండే, పీయూశ్ గోయల్‌ను పలుమార్లు కలవడంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి లేఖలు కూడా రాశానని కేటీఆర్ గుర్తుచేశారు. పబ్లిక్ -ప్రైవేట్ భాగస్వామ్యం లేదా జాయింట్ వెంచర్ రూపం లో సీసీఐ యూనిట్‌ను తిరిగి తెరిచే విషయా న్ని పరిశీలిస్తామని 2016లో అప్పటి కేంద్ర భారీ పరిశ్రమలు, పబ్లిక్ ఎంటర్‌ప్రెజైస్ మంత్రి అనంత్  ప్రకటించారని చెప్పారు.

కాని కేంద్రమంత్రి మాటలు నీటి మీది రాతలుగానే మిగిలాయని విమర్శించారు. రాష్ర్ట పరిధిలో ఉన్న సిర్పూర్ పేపర్ మిల్లును తమ ప్రభుత్వమే తిరిగి ప్రారంభించిందన్న కేటీఆర్, కేంద్రం తలుచుకుంటే సీసీఐ కూడా పునఃప్రారంభం అయ్యేదన్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్రం వెనక్కి తీసుకునే వరకు కా ర్మికులతో కలిసి ఉద్యమిస్తామని, సంస్థ పరిరక్షణ కోసం పోరాడతామన్నారు.