22-04-2025 12:00:00 AM
హైదరాబాద్, ఏప్రిల్ 21 (విజయక్రాంతి): హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమకు ఏమాత్రం బలం లేకపోయినా, తమదే గెలుపు అన్నంత ధీమాతో ముందుకెళ్తున్న బీజేపీ వ్యవహర శైలీ అందర్ని ఆశ్చర్యపరుస్తోంది. హిందుత్వ సెంటిమెంట్‌తో ఇన్నాళ్లు ప్రజలకు పిలుపునిస్తూ వచ్చిన బీజేపీ నేతలు, ఇప్పుడేకంగా ఇతర పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులకు సైతం ఇదే సెంటిమెంట్‌ను వాడి తమ వైపునకు మలుపుకునే వ్యూహం పన్నారు.
మొత్తం 112 ఓట్లలో కేవలం 25 ఓట్లున్న బీజేపీ, ఈ ఎన్నికల్లో ఎలా విజయం సాధిస్తుందనే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సాధారణ ప్రజలు ఓటర్లు అయితే అప్పుడు పోటీ చేస్తుందనుకుంటే ఓకే కానీ.. పార్టీలకు చెందిన ప్రజాప్రతినిధులు ఓటర్లుగా ఉన్న ఈ ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని పేర్కొనడం, ఆత్మప్రభోధానుసారం ఓట్లు వేయాలని కోరడంతో కమలనాథులు పాలిటిక్స్‌లో కొత్త ట్రెండ్ సృష్టిస్తున్నారు.
ముస్లింలకు ప్రాతినిథ్యం వహించే పార్టీగా ఎంఐఎంను వర్ణిస్తూ.. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లంతా తమ అభ్యర్థికే ఓటు వేయాలని బీజేపీ కోరుతోంది. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ కార్పొరేటర్లను కలిసి ఓట్లు వేయాలని అడుగుతామని ఇప్పటికే బీజేపీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి మీడియా సాక్షిగా వెల్లడించారు. ఇక హైదరాబాద్ జిల్లా పరిధిలో చాలా చోట్ల బీజేపీ సానుభాతిపరులు వేసిన ఫ్లెక్సీలు సైతం చర్చనీయాంశంగా మారాయి.
దేవీదేవతలను కించపరుస్తున్న, 15 నిమిషాలు సమయమిస్తే హిందువులందర్ని చంపేస్తామన్న ఎంఐఎంకు ఓటెయొద్దని హిందువులు స్థానిక కార్పొరేటర్‌ను కోరుతున్నట్టుగా ఈ ఫ్లెక్సీలు ఉన్నాయి. మొత్తం 112 ఓట్లు ఉండగా.. అందులో 81 మంది కార్పొరేటర్లు, 31 మంది ఎక్స్ అఫీషియో సభ్యులు ఉన్నారు. ఇందులో ఎంఐఎంకే అధిక బలం ఉంది. ఆ పార్టీకి 40 మంది కార్పొరేటర్లు, 9 మంది ఎక్స్‌అఫీషియో సభ్యులతో 49 ఓట్ల బలం ఉంది.
బీజేపీకి 19 మంది కార్పొరేటర్లు, 6గురు ఎక్స్‌అఫీషియో సభ్యులతో కలిపి 25 మంది, బీఆర్‌ఎస్‌కు 15 ప్లస్ 9 కలిపి 24, కాంగ్రెస్ 7 ప్లస్ 7తో 14 మంది సభ్యుల బలముంది. పోలింగ్‌కు దూరంగా ఉండాలని బీఆర్‌ఎస్ నిర్ణయం తీసుకోగా.. కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. బీజేపీ ఎన్ని జిమ్మిక్కులు చేసినా గెలుపు తమదేనని మజ్లిస్ భావిస్తోంది.