17-02-2025 10:46:41 PM
మహిళలకు టాయిలెట్స్ కట్టించి వారి ఆత్మగౌరవం నిలబెట్టారు..
గ్రామాల్లో పారే మురుగు నుండి రైతు వేదికలు దాకా అన్ని కేంద్రం ఇచ్చిన నిధులే..
బిజెపి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించండి..
కోదాడలో మాట్లాడిన మల్కాజ్ గిరి ఎంపీ ఈటల..
కోదాడ (విజయక్రాంతి): మూడున్నర కోట్ల మందికి ఇల్లు కట్టించిన ఘనత బీజేపీకే దక్కిందని మల్కాజ్ గిరి ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం కోదాడలో వికసిత భారత్ వికసిత బడ్జెట్ విశ్లేషణ కార్యక్రమం బొబ్బ భాగ్యరెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బిజెపి అభ్యర్థి బలపరిచిన వ్యక్తిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఉపాధ్యాయ సంఘ మిత్రులను కోరారు. కాంగ్రెస్ నేతలు పార్లమెంట్ లో మాట్లాడే విధానం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. బడ్జెట్ రాష్ట్రాలవారీగా పెట్టారు అనే విషయం వారికి తెలియదా..? అలా మాట్లాడడానికి సిగ్గుండాలి అని ద్వజమెత్తారు. వికసిత్ భారత్ కోసం ఇప్పుడు బడ్జెట్ పెట్టుకుంటున్నాం. ఈ పదేళ్ల బడ్జెట్ 2014 కంటే ముందు బడ్జెట్ నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు. ప్రపంచంలో ఎవరికి ఆకలి వేసిన అన్నం పెట్టే సత్తా ఇప్పుడు భారత్ దేశానికి ఉందని గర్వంగా చెప్పుకొచ్చారు.
కరోనా సమయం నుండి కోట్ల ప్రజానీకానికి ఐదు కేజీల బియ్యం ఇస్తున్న దేశం మనది. గ్రామాల్లో పారే మురుగు కాలువలు, నడిచే రోడ్లు, తడి పొడి చెత్త షెడ్లు, లైట్లు, స్మశాన వాటికలు, రైతు వేదికలు అన్ని కేంద్రం ఇచ్చే నిధులే అని అన్నారు. హైదరాబాదులో ఉన్న రైల్వే స్టేషన్ అన్ని రెండు వేల కోట్లు పెట్టి ఆధునికరిస్తున్నారని తెలిపారు. విమానాశ్రయాల మాదిరిగా అభివృద్ధి చేస్తున్నారు. 11 లక్షల కోట్లు క్యాపిటల్ ఎక్స్‌పెండేచర్ కోసం ఖర్చు పెడుతున్నారు. మహిళలకు టాయిలెట్స్ కట్టించి వారి ఆత్మగౌరవం నిలబెట్టారు. ప్రపంచంలో దేశంలో ఉన్న నేను భారతీయుణ్ణి అని గర్వంగా చెప్పుకుంటున్నాము అంటే ఇది వలనే సాధ్యమైందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి బలపరిచిన అభ్యర్థి, బిజెపి నేతలు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.