08-04-2025 01:15:37 AM
హైదరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): తెలంగాణకు బీజేపీ ఏం చేసిందేమీ లేదని, ఈ అంశంపై చర్చించేందుకు సిద్ధమా అని బీజేపీ పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ సవాలు విసిరారు. రాష్ట్రానికి కేంద్రప్రభుత్వం విడుదల చేసిన నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఒక్క చాన్స్ పేరుతో కిషన్‌రెడ్డి ప్రాధేయపడుతున్నారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రానికి రావాల్సిన వాటా లు, నిధులు విడుదలో అన్యాయం చేస్తున్నందుకు అవకాశం ఇవ్వాలా? అని ప్రశ్నించారు.
సోమవారం పీసీసీ చీఫ్ గాంధీభవన్‌లో ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, పార్టీ నేతలు లింగంయాదవ్, ఎన్‌ఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటస్వామి, పీసీసీ అధికార ప్రతినిధి కొమురయ్యతో కలిసి మీడియాతో మాట్లాడారు. బీజేపీ 11 ఏళ్ల పాలనలో ప్రధాని మోదీ ఏం ఉద్ధరించారో సమాధానం చెప్పాలన్నారు. లౌకిక వాదాన్ని నమ్ము కున్న తెలంగాణ ప్రజలు బీజేపీని ఎట్టి పరిస్థితుల్లో అందరించరని మహేశ్‌కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.
అధికారంలోకి వస్తే ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని ప్రగల్భాలు పలికిన మోదీ గురించి కిషన్‌రెడ్డి ఎందుకు మాట్లడటం లేదని ఆయన నిలదీశారు. బీఆర్‌ఎస్ పదేళ్ల హయాంలో బంగారం లాంటి ప్రభుత్వ భూములను అమ్మితే బీజేపీ నేతల కళ్లు మూసుకుపోయాయా? అని ప్రశ్నించారు. బీసీల 42 శాతం రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చేలా తెలంగాణ బీజేపీ నేతలు ఎందుకు చొరవ తీసుకోవడం లేదన్నారు.
మోదీ, అమిత్‌షా పర్మిషన్ లేనిదే సంజయ్ టిఫిన్ కూడా చేయలేడన్నారు. విభజన హామీలపై మాట్లాడాలని ఆయన సూచించారు. తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్రంతో సహకరించడానికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు. హైదరాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ స్థానిక సంస్థల ఎన్నికలో బీజేపీకి బలం లేకపోయినా పోటీ చేయడంలో ఆంతర్యమేమిటని ప్రశ్నించారు.