- మహాయుతిలో సీఎం, రెండు డిప్యూటీల ఫార్ములా సిద్ధం
- శివసేన, ఎన్సీపీ నేతలకు డిప్యూటీతో పాటు కీలక శాఖలు
- 2019 పరిణామాల దృష్ట్యా అప్రమత్తంగా నేతలు
ముంబై, నవంబర్ 27: మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవిపై ఏక్‌నాథ్ షిండే వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది. సీఎం ఎంపిక అంశంలో ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అగ్రనేతల నిర్ణయమే ఫైనల్ అంటూ షిండే స్పష్టం చేయడంతో బీజేపీ నేతనే ముఖ్యమంత్రి అవుతారని హింట్ ఇచ్చారు. ప్రస్తు తం ఉన్న సమాచారంతో పాటు మొదటి నుంచి బీజేపీకి చెందిన నేతనే ముఖ్యమంత్రి గా ఉంటారని తెలుస్తోంది.
దాని ప్రకారం దేవేంద్ర ఫడ్నవీస్ మహారాష్ట్ర తదుపరి సీఎం కావడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. దీంతో పాటు మహాయుతి కూట మిలోని భాగస్వామ్య పార్టీల అధినేతలు ఏక్‌నాథ్ షిండ్, అజిత్ పవార్‌కు డిప్యూటీ సీఎం లతో పాటు కీలక శాఖలు దక్కుతాయని సమాచారం. ఈ మేరకు మహాయుతి ప్రభు త్వ ఫార్ములా సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గా లు వెల్లడించాయి. ఇందుకు శివసేన, ఎన్సీపీ నేతల మద్దతిస్తున్నట్లు కూడా చెప్తున్నారు.
కూటమి చీలకుండా..
మహారాష్ట్రలో గత ఎన్నికల్లో ఇలాంటి పరిస్థితుల్లోనే బీజేపీ, శివసేన మధ్య సమస్యలు మొదలయ్యాయి. 2019 ఎన్నికల్లో బీజేపీ, అవిభక్త శివసేన మిత్రపక్షాలుగా పోటీ చేశాయి. ఈ కూటమే ఎన్నికల్లో విజయం సాధించింది. కానీ ముఖ్యమంత్రి పదవిని పంచుకునే అంశంలో విభేదాలు రావడంతో బీజేపీతో శివసేన విడిపోయింది. కాంగ్రెస్, ఎన్సీపీతో కలిసి ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలో మహావికాస్ అఘాడీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది.
ఉద్ధవ్ సీఎం అయ్యారు. తర్వాత మహారాష్ట్ర రాజకీయాలు గందరగోళంగా మారాయి. 2022లో షిండే నేతృత్వంలో శివసేన చీలిపోగా.. 2023లో అజిత్ పవార్ ఎన్సీపీని చీల్చారు. ఈ రెండు వర్గాలు బీజేపీతో జత కలిసి మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి ఠాక్రేను గద్దె దించాయి. బీజేపీకి అప్పుడు ఎక్కువ సీట్లు ఉన్నప్పటికీ షిండేను ముఖ్యమంత్రిని చేసి మిగతా రెండేళ్లపాటు ప్రభుత్వాన్ని నడిపించాయి.
ప్రస్తుతం మళ్లీ కూటమి మధ్య ఎలాంటి పొరపచ్చాలు రాకుండా ఉమ్మడి నిర్ణయంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని మహాయుతి నేతలు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఆమోదయోగ్య నిర్ణయమే..
మహారాష్ట్రలో మహాయుతి కూటమి భారీ విజయం తర్వాత సీఎం ఎవరనే చర్చ మొదలైంది. బీజేపీ సొంతంగా 132 సీట్లు సాధించడంతో షిండేకే మళ్లీ అవకాశమి స్తారా? లేదా ఫడ్నవీస్‌ను సీఎం చేస్తారా? అనే అంశాలపై సందిగ్ధం నెలకొంది. అయితే, కూటమి మాత్రం ఈ విషయాలపై పెద్దగా స్పందించలేదు. 2019 ఎన్నికల్లో జరిగిన పరిణామాలు మళ్లీ పునరావృతం కాకుండా 3 పార్టీలు జాగ్రత్త లు తీసుకున్నాయి.
ఇప్పటికే సీఎం ఎంపిక విషయంలో ఎలాంటి వివా దం ఉండబోదని, మూడు పార్టీలు కలిసి అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. ఏక్‌నాథ్ షిండే, అజిత్‌పవార్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెల్లడించడం గమనార్హం.