- బీఆర్‌ఎస్, బీజేపీ డీఎన్‌ఏ ఒక్కటే..
- పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించింది ఆ రెండు పార్టీలే..
- ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి ఫైర్
హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): దేశవ్యాప్తంగా మొత్తం 10 ప్రభుత్వాలను కూలదోసి, తమ ప్రభుత్వాన్ని నిలబెట్టుకునే సంస్కృతి బీజేపీదేనని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో సుప్రీం కోర్టుతో చీవాట్లు తిన్న చరిత్ర ఆ పార్టీదేనని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయ న మాట్లాడారు. తెలంగాణలో రాజ్యాం గం అపహాస్యం పాలవుతోందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అంటున్నారని, నిజంగా రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నది ఎవరో దేశం మొత్తానికి తెలుసునన్నారు. ఈడీ, సీబీఐ, ఇన్ కం ట్యాక్స్ వంటి సంస్థలను ఎమ్మెల్యేలపై ఎగదోసి, వారిని బీజేపీలో చేర్చుకుంటున్నారని ఆరోపించారు.
మాట వినని పార్టీలను ముక్కలు చెక్కలు చేస్తుందన్నారు. ఉత్తరాదిలో బీజేపీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తుంటే, తెలంగాణలో బీఆర్‌ఎస్ ఆ పని చేసిందని ఆరోపించారు. 2014లో టీడీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాసరావు, 2018లో కాంగ్రెస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని.. నాడు కేసీఆర్ తన మంత్రి వర్గంలో చేర్చుకున్నారని గుర్తుచేశారు. బీజేపీ, బీఆర్‌ఎస్ డీఎన్‌ఏ ఒక్కటేనని విమర్శించారు. పార్లమెంటు ఎన్నికల్లో రెండు పార్టీలు ఒక తల్లికి పుట్టిన బిడ్డల్లా ఎంతలా కలిసిపోయారో తెలంగాణ ప్రజలందరికీ తెలుసునన్నారు. మోదీ అన్న కోసం తమ్ము డు కేసీఆర్ రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నారన్నారు.
సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డిని పరోక్షంగా గెలిపించింది బీఆర్‌ఎస్సేనన్నారు. కేసీఆర్ తన ఎమ్మెల్యేలను కావాలని కాంగ్రెస్‌లోకి పంపిస్తున్నారని కిషన్‌రెడ్డి అనడం సబబు కాదన్నారు. బీజేపీ ఇప్పటికే మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్‌తో ఢిల్లీలో సంప్రదింపులు జరుపుతున్నా రని, బీజేపీతో చేతులు కలిపేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ కూడా ఉవ్విళ్లూరుతు న్నారని ఆరోపించారు. త్వరలోనే బీఆర్‌ఎస్ రాజ్యసభ పక్షం బీజేపీలో విలీనం అవుతుందని జోస్యం చెప్పారు. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్‌ఎస్ పూర్తిగా బీజేపీలో విలీనం అవుతుందన్నారు. అలా వీలుకాకపోతే రెండు పార్టీలూ పొత్తు పెట్టుకుంటా యన్నారు.
లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఇప్పించేందుకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్, ఆయన కుటుం బం సిదమవుతోందని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కలలు కంటున్నారని, నాలుగు సీట్లు ఎక్కువగా గెలిచినంత మాత్రాన అధికారంలోకి వస్తుందనుకోవడం ఉత్త భ్రమేనని కొట్టిపారేశారు.