మంచిర్యాల : మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావుకు మంత్రి పదవిపై ఉన్న ధ్యాస ప్రజల సమస్యలను పరిష్కరించడంలో లేదని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ వెరబెల్లి విమర్శించారు. మంగళవారం పట్టణంలోని తాండ్ర పాపారాయుడు ఫంక్షన్ హాలులో నిర్వహించిన మంచిర్యాల నియోజక వర్గ స్థాయి సమావేశంలో పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ తో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘునాథ్ వెరబెల్లి మాట్లాడుతూ... రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఎన్నికల సమయంలో ఇచ్చిన గ్యారంటీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు.
రైతు రుణ మాఫీ, రైతు భరోసా పేరుతో రైతులను, ఉద్యగాలు, నిరుద్యోగ భృతి పేరుతో నిరుద్యోగ యువతను, ప్రతి మహిళకు రూ.2500 అని మహిళలను, పెన్షన్ పెంపు పేరుతో వృద్ధులను, వికలాంగులను ఇలా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిడని దుయ్యబట్టారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు నియోజక వర్గంలో ఉన్న ప్రజల సమస్యలు గాలికి వదిలేసి మంత్రి పదవీ కోసం హైదరాబాద్, ఢిల్లీ చుట్టూ ప్రదీక్షణలు చేస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించకుంటే బీజేపీ తరపున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు.