- జాతీయ అధ్యక్షుడిగా దాదాపు ఖరారు?
- జాతీయ మీడియాలో కథనాలు
- మహారాష్ట్ర డిఫ్యూటీ సీఎంకు ఎలివేషన్
న్యూఢిల్లీ, ఆగస్టు 2: లోక్‌సభ ఎన్నికల తర్వాత రాజకీయ వర్గాల్లో బాగా చర్చకు వస్తు న్న అంశం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి తదుపరి జాతీయ అధ్యక్షుడు ఎవరు? అని. ఈ ప్రశ్నకు అనేక పేర్లు సమాధానంగా వినిపించినప్పటికీ.. చివరకు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ పేరు ప్రధానంగా వినిపిస్తున్నది. ప్రస్తుత అధ్యక్షుడు జేపీ నడ్డా కేంద్రమం త్రిగా బాధ్యతలు చేపట్టగానే అధ్యక్షుడి మార్పు ఖాయమని తేలిపోయింది.
ఆ పదవికి తగిన వ్యక్తికోసం పార్టీ తీవ్రంగా వెదుకుతున్నట్టు వార్తలు వచ్చాయి. తాజా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మెజారిటీ మార్క్ సీట్లు సాధించకపోవటంతో ఆ పార్టీ మాతృ సంస్థ ఆర్‌ఎస్‌ఎస్ మళ్లీ రంగంలోకి దిగినట్టు చెప్తున్నారు. తాము సూచించిన వ్యక్తిని పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నియమించాలని ప్రధాని మోదీ, అమిత్ షా కు సంఘ్ నేతలు గట్టిగా చెప్పినట్టు తెలిసింది.
ఖరారైనట్టేనా?
ఇటీవల రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నీతీ ఆయోగ్ సమావేశం జరిగిన రోజే ప్రధాని నరేంద్రమోదీ బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు. ఆ సమావేశం ముగిసిన వెంటనే ఫడ్నవిస్‌తో ప్రధాని ఏకాంతంగా భేటీ అయినట్టు తెలిసింది. ఆ సందర్భంగా మోదీతో ఫడ్నవిస్ కుటుంబం గ్రూప్ ఫొటో కూడా దిగింది. ఆ భేటీలోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టేందుకు సిద్ధం కావాలని ఫడ్నవిస్‌కు ప్రధాని సూచించినట్టు పార్టీలోని ఉన్నత స్థాయి వర్గాలు తెలిపాయి.
త్వరలోనే ఆయన మహారాష్ట్ర డిఫ్యూటీ సీఎం పదవికి రాజీనామా చేసి ఢిల్లీకి పయమవుతారని పేర్కొన్నాయి. అయితే, మహారాష్ట్రలో ఈ ఏడాది చివర్లోనే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీని ఫడ్నవిస్ చేతి నుంచి మరొకరి చేతిలో పెట్టడం సరైన పని కాదని కొందరు నేతలు అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే, మోదీ మాత్రం సానుకూలంగా ఉన్నారట.