calender_icon.png 2 November, 2024 | 11:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రాష్ట్రంలో చిచ్చుకు బీజేపీ కుట్ర

12-05-2024 01:47:48 AM

హిందు ముస్లింల మధ్య  గొడవకు ప్రయత్నం

శాంతి భద్రతలు ఉంటేనే అభివృద్ధి సాధిస్తాం

పటాన్‌చెరు రోడ్ షోలో సీఎం రేవంత్‌రెడ్డి 

సంగారెడ్డి, మే 11 (విజయ క్రాంతి): భారత రాజ్యాంగం ఉండాలన్నా.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు రిజర్వేషన్లు ఉండాలన్నా లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించి కాంగ్రెస్‌ను గెలిపించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరారు. శనివారం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరులో మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా నిర్వహించిన రోడ్ షోలో సీఎం పాల్గొని ప్రసంగించారు.

హిందు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించి కొట్లాట పెట్టాలని బీజేపీ కుట్ర చేస్తున్నదని విమర్శించారు.  శాంతి భద్రతలు అదుపులో ఉన్నప్పడే పెట్టుబడులు వస్తాయని తెలిపారు. బీజేపీ అధికారంలోని వస్తే ప్రజలు కత్తులతో కొట్లాడుకునే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు ప్రాధాన్యమిస్తుందని తెలిపారు. మధును లక్ష మోజార్టీతో గెలిపించాలని కోరారు. 

కులం, మతం పేరుతో ఎన్నికలు

దేశంలో 17 సార్లు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో అభివృద్ధి,  సంక్షేమం ప్రధాన అంశాలుగా ఉన్నాయని, ప్రస్తుత ఎన్నికల్లో కులం, మతం, ప్రాంతీయాలే ప్రధానాంశాలుగా మారాయని అన్నారు. పటాన్‌చెరు ప్రాంతం మీనీ ఇండియాగా ఉంటుందని,  పరిశ్రమల్లో కుల, మత బేధాలు లేకుండా ఉత్పత్తులు చేస్తున్నారని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ సమస్య సుప్రీంకోర్టులో ఉందని, ఈ అంశాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ పర్యవేక్షిస్తున్నారని చెప్పారు.

ముదిరాజ్‌లను బీసీ డీ గ్రూపు నుంచి ఏ గ్రూపులోకి మార్చేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మల్లన్నసాగర్ రిజర్వాయర్‌లో 14 గ్రామాలను ముంచిన బీఆర్‌ఎస్ అభ్యర్థి వెంకట్‌రామ్‌రెడ్డికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని కోరారు. బీఆర్‌ఎస్ అభ్యర్థి తెల్లాపూర్‌లో వందల ఎకరాల భూమిని అక్రమించారని ఆరోపించారు. రోడ్ షోలో మంత్రులు దామోదర రాజనర్సిహ, కొండా సురేఖ, మెదక్ అభ్యర్థి నీలం మధు, మెదక్ ఎమ్మెల్యే రోహిత్‌రావు, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, పార్టీ నేతలు కాట శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు.