25-03-2025 11:42:33 PM
త్వరలో బీజేపీ చీఫ్ నియామకం..
మహిళకు చాన్స్ అంటూ వార్తలు..
కొనసాగుతున్న వడపోత ప్రక్రియ..
న్యూఢిల్లీ: బీజేపీ పార్టీకి త్వరలోనే కొత్త జాతీయ అధ్యక్షులు రానున్నారు. ప్రస్తుతం అధ్యక్షుడిగా కొనసాగుతున్న నడ్డా చాలా రోజులుగా ఉన్నారు. ఆయన పదవీకాలం పూర్తయినా కానీ 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో బీజేపీ అధిష్ఠానం నడ్డా పదవిని పొడగిస్తూ నిర్ణయం తీసుకుంది. నడ్డా సారధ్యంలో బీజేపీ ఎదురులేని శక్తిగా అవతరించింది. ప్రస్తుతం జేపీ నడ్డా బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతూ.. కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి పదవిని కూడా నిర్వర్తిస్తున్నారు. ఇప్పటికే నడ్డా పదవిని పొడగించడంతో ఈ సారి ఎలాగైనా కచ్చితంగా కొత్త వారిని అధ్యక్ష కుర్చీలో కూర్చోబెట్టాలని బీజేపీ గట్టిగా భావిస్తోంది.
ఆరేళ్లుగా ఆయనే..
బీజేపీ అధ్యక్షుడి పదవీ కాలం మూడేళ్లు ఉంటుంది. కానీ ప్రస్తుతం అధ్యక్షుడిగా ఉన్న నడ్డా మాత్రం 2019 నుంచి ఈ పోస్టులో కొనసాగుతున్నారు. ఇప్పటికే బీజేపీ పెద్దలు కొత్త జాతీయ అధ్యక్షుడి కోసం గాలింపు మొదలుపెట్టారు. పార్టీలో సంస్థాగత ఎన్నికలను కూడా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని అనుకోని అనూహ్య పరిణామాలు కూడా ఎదురవుతున్నాయి. దీంతో ఎంపిక మరింత ఆలస్యం అవుతోంది. ఇంకా సంస్థాగత ఎన్నికలు నిర్వహించాల్సిన పెద్ద రాష్ట్రాల జాబితాలో బీహార్, రాజస్థాన్ మాత్రమే ఉన్నాయి. బీజేపీ సంప్రదాయాల ప్రకారం పార్టీలో ఉన్న వ్యక్తి ఏకకాలంలో ఒకే పదవి నిర్వహించాలి. కానీ నడ్డా విషయంలో మాత్రం ఆ రూల్ పని చేయడం లేదు. ఆయన ఒకే సమయంలో ఇటు పార్టీ జాతీయ అధ్యక్షుడితో పాటు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రిగా కూడా కొనసాగుతున్నారు.
ఈసారి మహిళకు పగ్గాలు..
మోదీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎవరు నియమితులవుతారని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. బీజేపీ అధిష్టానం కూడా ఈ మ్యాటర్‌ను సీరియస్‌గా తీసుకుంది. ఇప్పటికే అన్ని రాష్ట్రాలను బీజేపీ సంప్రదిస్తోంది. బీజేపీ జాతీయ నాయకత్వ పగ్గాలు తొలి సారి ఓ మహిళ చేతికి వెళ్లేలా ఉన్నాయని కూడా పలు విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీలో జరిగే విషయాలు కూడా అందుకు తగిన విధంగానే ఉంటున్నాయి.
తాజాగా బీజేపీ పార్టీ ఢిల్లీలో మహిళను సీఎం కుర్చీలో కూర్చోబెట్టింది. అంతే కాకుండా పార్టీ అధ్యక్షుడు లేదా అధ్యక్షురాలిని దక్షిణాది నుంచి ఎంపిక చేయాలని కూడా పార్టీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం దక్షిణాది మొత్తం డీలిమిటేషన్ సమస్యతో ఆగ్రహంగా ఉంది. కేంద్రంలో ఉన్న బీజేపీ మీద దక్షిణాది పార్టీలు చిర్రుబుర్రులాడుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు బీజేపీ దక్షిణాది నుంచి అధ్యక్ష పదవిని భర్తీ చేస్తుందని టాక్ నడుస్తోంది. మరి చూడాలి.. బీజేపీ ఎటువంటి ఎత్తుగడను అమలు చేస్తుందో..