20-03-2025 09:15:08 AM
బీజేపీ భద్రాద్రి జిల్లా నూతన అధ్యక్షులు శ్రీ బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి
భద్రాచలం,(విజయక్రాంతి): భారతీయ జనతా పార్టీ (బీజేపీ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నూతన అధ్యక్షులుగా ఎన్నికైన బైరెడ్డి ప్రభాకర్ రెడ్డి బుధవారం భద్రాచలం విచ్చేయగా, భద్రాచలం నియోజకవర్గం బీజేపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు స్థానిక బ్రిడ్జి సెంటర్ వద్ద పూలమాలలు, పుష్ప గుచ్చాలతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేసిన తరువాత స్థానిక రెడ్డిసత్రంలో జరిగిన ప్రెస్-మీట్ లో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో బీజేపీ పార్టీ జూనియర్, సీనియర్ నాయకులను, కార్యకర్తలను ఎలాంటి తారతమ్యం భేదాలు లేకుండా కలుపుకుంటూ పార్టీని బలపరుస్తూ, కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయ శక్తిగా అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు.
మన జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ కథ సమాప్తమయిందని, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రస్తుతం ఉన్న ముగ్గురు మంత్రులు ఎలాంటి ప్రత్యేక విధులు, నిధులు జిల్లా కోసం తీసుకురాకపోగా, పాత పనులకు కమీషన్లు వసూలు చేస్తూ, అవినీతికి పరాకాష్టగా మిగిలారని అన్నారు. ఈ రెండు పార్టీలతో విసిగి నలిగిన జిల్లా ప్రజలు భారతీయ జనతా పార్టీని భవిష్యత్తు దిక్సూచిగా చూస్తున్నారని, దానికి ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికలలో పెరిగిన ఓట్ల శాతం నిదర్శనమని అన్నారు. అలాగే బీజేపీ కేంద్ర ప్రభుత్వం కూడా జిల్లాలో రైల్వే లైన్ నిర్మాణానికి, భద్రాద్రి రామాలయానికి, గిరిజన గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు ఇస్తు జిల్లా అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. రానున్న ఏప్రిల్ 6 పార్టీ ఆవిర్భావ దినోత్సవం రోజున జిల్లాలో పోలింగ్ బూతు స్థాయిలో జెండాలు ఎగిరివేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ కుంజా ధర్మ, బీజేపీ సీనియర్ నాయకులు త్రినాథ రావు, ములిశెట్టి రామ్మోహన్ రావు, పసుమర్తి సతీష్, రఘురాం, ఓబీసీ మోర్చ జిల్లా అధ్యక్షులు బిట్రగుంట్ల క్రాంతి కుమార్, బీజేపీ భద్రాచలం, చర్ల మండల అధ్యక్షులు ముత్యాల శ్రీనివాసరావు, నూపా రమేష్*, జిల్లా కౌన్సిల్ మెంబర్ నిడదవోలు నాగబాబు, మహిళా మోర్చా నాయకులు ముక్కెర కోటేశ్వరి, పట్టణ కమిటీ నాయకులు చెల్లుబోయిన వెంకన్న, యువ మొర్చ నాయకులు ములిశెట్టి నిఖిల్, అన్నెం సాయి లక్ష్మణ్, అన్నం హరీష్ తదితరులు పాల్గొన్నారు.