calender_icon.png 25 October, 2024 | 5:56 AM

బీజేపీ, కాంగ్రెస్‌వి డ్రామాలు

05-05-2024 12:57:04 AM

మాజీ మంత్రి పొన్నాల 

హైదరాబాద్, మే 4(విజయక్రాంతి) : ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు డ్రామాలకు తెరలేపాయని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య ఆరోపించారు. ఎన్నికల్లో వాతావరణం తమకే అనుకూలంగా ఉన్నట్లు ఇరు పార్టీలు నటిస్తున్నాయని పేర్కొన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ... కేంద్రంలో తామే అధికారంలోకి వస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతోందని, రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అవుతారని హామీలు గుప్పిస్తోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ 420 హమీలు ఇచ్చి ఒక్కటి కూడా అమలు చేయడం లేదని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డికి అబద్దాల్లో ఆస్కార్ అవార్డు వస్తుందన్న పొన్నాల.. గడిచిన 100 రోజుల్లో ఒకటి, రెండు తప్ప మిగిలిన అన్ని హామీలను మరిచారని గుర్తు చేశారు.

డిసెంబర్ 9న రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు హామీ ఇచ్చి ఇప్పుడు దేవుళ్ళ మీద ఒట్లు వేస్తున్నాడని, ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాడని విమర్శించారు. ఎన్నికలకు మరో 7 రోజులు మాత్రమే ఉండగా ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ అడ్డగోలుగా అడ్వర్టుజ్‌మెంట్లు ఇస్తోందన్నారు. రామ మందిరం పేరుతో బీజేపీ సమాజాన్ని చీల్చే కుట్ర చేస్తుందని, ఓట్ల కోసం రామమందిరాన్ని అస్త్రంగా వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. నల్ల చట్టాలతో వందల మంది రైతులను బీజేపీ పొట్టన పెట్టుకుందన్నారు.