calender_icon.png 19 April, 2025 | 11:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మానేరు రివర్ ఫ్రంట్ పనులను అడ్డుకునేందుకు బీజేపీ, కాంగ్రెస్ కుట్ర

19-04-2025 05:44:28 PM

బీఆర్ఎస్ పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరిశంకర్..

కరీంనగర్ (విజయక్రాంతి): మానేరు రివర్ ఫ్రంట్(Manair River Front) పనులను ఆపేందుకు బీజేపీ, కాంగ్రెస్ లు కుట్రలు చేస్తున్నాయని టీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరి శంకర్ అన్నారు. శనివారం ఆయన కరీంనగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... మానేరు నది కరీంనగర్ ను ఆనుకొని ప్రవహించడం గొప్ప అసెట్ అని, కరీంనగర్ పర్యాటకంగా అభివృద్ధి చేయాలని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రులు కేటిఆర్, గంగుల కమలాకర్, మాజీ ఎంపీ బొయినిపల్లి వినోద్ కుమార్ లు కృషి చేశారని అన్నారు.

542 కోట్లను మంజూరు చేసి పనులను ప్రారంభించారని, బోయినిపల్లి వినోద్ కుమార్... గంగుల కమలాకర్ ల చొరవతో పనులు సాఫీగా సాగాయని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే  అవినీతి జరిగిందని పనులను ఆపారని,  మానేరు రివర్ ఫ్రంట్ కోసం కేటాయించిన నిధులతో పనులు పూర్తి చేయాలని మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత శాసనసభ్యులు గంగుల కమలాకర్ అసెంబ్లీలో గళ మెత్తారని,  స్పందించిన కాంగ్రెస్ పాలకులు మళ్లీ పనులను ప్రారంభించారని అన్నారు. ఇప్పుడు పనులను ఆపేందుకు బిజెపి కుట్రలు చేస్తుందని,  కరీంనగర్ మాజీ మేయర్ ఊసరవెల్లి సునీల్ రావు కమీషన్ కోసం మానేరు రివర్ ఫ్రంట్ కాంట్రాక్టర్ దగ్గర బ్లాక్ మెయిల్ బెదిరింపులకు పాల్పడుతున్నాడని ఆరోపించారు.

కరీంనగర్ మేయర్గా ఆయన చరిత్ర మొత్తం అవినీతిమయమేనని, మేయర్ పదవి పోయి కలెక్షన్ రాకపోవడంతో ఇప్పుడు మానేర్ రివర్ ఫ్రంట్ పై పడ్డాడని అన్నారు. మానేరు రివర్ ఫ్రంట్ లో అవినీతి జరిగిందంటున్న సునీల్ రావు  నువ్వు మేయర్ గా ఉన్నప్పుడు అవినీతి కనిపించలేదా అని ప్రశ్నించారు. పదవ తరగతి ఫెయిల్ అయిన సునీల్ రావు మానేరు రివర్ ఫ్రంట్ డిజైన్ పై మాట్లాడడం విడ్డూరంగా ఉందని ఎద్దేవా చేశారు. సునీల్ రావుకు కరీంనగర్ అభివృద్ధి పై చిత్తశుద్ధి ఉంటే... రివర్స్ ఫ్రంట్ కోసం... కేంద్ర మంత్రి బండి సహకారంతో మరో 200 కోట్లు అదనంగా తీసుకురావాలని, దమ్ముంటే మానేరును అనుకొని ఉన్న డంపింగ్ యార్డును తరలించాలని సవాల్ విసిరారు. బండి సంజయ్ నిన్ను గెలిపించిన ప్రజల రుణం తీసుకోవాలంటే నగరానికి కొత్తగా ఏమైనా తీసుకురా అని అన్నారు. రివర్ ఫ్రంట్ కోసం కేంద్రం రెండు వందల కోట్లు... రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల కోట్లు కెటాయించాలని అన్నారు.

బండి సంజయ్  ఊసరవెల్లి సునీల్ రావుతో అప్రమత్తంగా ఉండాలని హితావు పలికారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కరీంనగర్ మున్సిపాలిటీలో 50 స్థానాలకు పైగా బిఆర్ఎస్ కైవసం చేసుకుంటుందని, కరీంనగర్ బల్దియాపై మూడవసారి గులాబీ జెండాను ఎగరేస్తామని తెలిపారు. మానేరు రివర్ ఫ్రంట్ ను పూర్తి చేసేందుకు... మంత్రులు శ్రీధర్ బాబు... పొన్నం ప్రభాకర్... ఉత్తమ్ కుమార్ రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నగర బి ఆర్ ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రశాంత్ రెడ్డి, నగర బిఆర్ఎస్ పార్టీ మైనార్టీ అధ్యక్షులు షౌకత్, కరీంనగర్ నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ యూత్ ప్రధాన కార్యదర్శి గంగాధర చందు, నగర బీఆర్ఎస్ పార్టీ మైనార్టీ ప్రధాన కార్యదర్శి వాజిద్, నగర బి ఆర్ ఎస్ వి అధ్యక్షులు బొంకురి మోహన్, నాయకులు అరె రవి,చేతి చంద్రశేఖర్, రాజ్ కుమార్, నారదాసు వసంతరావు, ఒడ్నాల రాజు, సత్తినేని శ్రీనివాస్, జశ్వంత్, పవన్, చుక్క శ్రీనివాస్, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.