వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు
హైదరాబాద్, ఆగస్టు 1 (విజయక్రాంతి): రాష్ట్రంలో చాలామంది రైతులకు రుణమాఫీ జరగలేదని బీజేపీ నాయకులు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందని వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు. 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామన్న బీజేపీ వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. గత 10 ఏళ్లలో పెరిగిన ఖర్చులతో పోల్చుకుంటే నికర ఆదాయం పెరగని వారందరు బీజేపీ టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేస్తే సమాధానం చెప్తారా? అని నిలదీశారు. రాజధాని వీధుల్లో నిరసన వ్యక్తంచేస్తున్న రైతులను ఎప్పుడైనా పట్టించుకున్నారా? అని ధ్వజమెత్తారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఒక రాష్ట్రంలోనైనా రుణమాఫీ చేసి చూపించగలరా? అని నిలదీశారు.
లక్షల కోట్లు ఎగవేసిన పారిశ్రామికవేత్తల నుంచి నిధులు రికవరీ చేసి దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల రుణమాఫీ చేయగల నిబద్ధత ఉందా? అని విరుచుకుపడ్డారు. క్వింటాల్ ధాన్యం ఉత్పత్తికి రూ.౨౮౭౬ ఇవ్వాల్సి ఉండగా, తప్పుడు పద్ధతుల్లో కేవలం రూ.౨౨౦౩ ప్రకటించి రైతులకు తీరని నష్టం చేశారని ధ్వజమెత్తారు. వ్యవసాయ రంగంలో కీలకమైన డీజి ల్, పెట్రోల్‌లను రైతులకు సబ్సిడీపై అందించాల్సిన విషయంపై రాష్ట్ర బీజేపీ నాయకులు తమ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని సూచించారు. రైతు ఉద్య మం సందర్భంగా అమరులైన 708 మంది రైతు కుటుంబాలకు తక్షణ పరిహారం చెల్లించి, రైతుల డిమాండ్ల పరిష్కరించే విధంగా ప్రయత్నాలు చేయాలని హితవు పలికారు.