calender_icon.png 15 March, 2025 | 3:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బీజేపీ, అన్నాడీఎంకే వాకౌట్

14-03-2025 11:39:55 PM

కొనసాగిన రూపాయి గుర్తు రగడ

ప్రభుత్వ తీరును తప్పుబట్టిన బీజేపీ, అన్నాడీఎంకే

రాజీనామాకు డిమాండ్ చేసిన అన్నాడీఎంకే

చెన్నై: తమిళనాడు ఆర్థిక మంత్రి తెన్నరాసు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. బడ్జెట్ ప్రతులపై రూపాయి గుర్తును తొలగించినందుకు నిరసనగా.. బీజేపీ, ఏఐఏడీఎంకేలు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశాయి. బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న సమయంలో ఈ పార్టీల నేతలు వాకౌట్ చేశారు. తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ (టీఏఎస్‌ఎంఏసీ)లో భారీ ఎత్తున అవినీతి చోటు చేసుకుందని బీజేపీ ఆరోపిస్తోంది. దీనిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మాట్లాడుతూ.. ‘టీఎస్‌ఎంఏసీ కుంభకోణంపై విచారణ జరపాలి. రాష్ట్ర అప్పులు రూ. 9 లక్షల కోట్లు దాటిపోయాయి. ఈ బడ్జెట్‌లో ఉత్పాదకత ఒక్కటీ లేదు’ అని విమర్శించారు. డీలిమిటేషన్ సమస్యపై ఆయన మాట్లాడుతూ.. ‘డీఎంకే అనవరసరంగా ఈ సమస్యను జఠిలం చేస్తోంది. ఇది పెద్ద సమస్యే కాదు. ఎంపీ స్థానాల్లో ఎటువంటి మార్పులు జరగవని కేంద్ర హోం మంత్రే చెప్పారు. సీట్లలో ఎటువంటి మార్పులు ఉండవు’ అని అన్నారు. 

నల్లచీరతో బడ్జెట్ సెషన్‌కు

బీజేపీ ఎమ్మెల్యే వనతి శ్రీనివాసన్ నలుపు రంగు చీర ధరించి బడ్జెట్ సెషన్‌కు హాజరయ్యారు. ‘ఈ ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోయింది. కోర్సులలో తమిళాన్ని చేర్చడాన్ని మేము స్వాగతిస్తాం. కానీ తమిళ సాంప్రదాయం పేరు చెప్పి వారు జాతీయ గుర్తుకు వ్యతిరేఖంగా ప్రవర్తిస్తున్నారు. రాజ్యాంగం పట్ల అగౌరవానికి ఇది నిదర్శనం’ అని అన్నారు. ఈ కుంభకోణానికి బాధ్యత వహిస్తూ ప్రభుత్వం రాజీనామా చేయాలని పళనిస్వామి డిమాండ్ చేశారు.