calender_icon.png 17 January, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లక్ష డాలర్లు దాటిన బిట్‌కాయిన్

06-12-2024 12:00:00 AM

న్యూయార్క్, డిసెంబర్ 5: యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించినప్పటి నుంచి క్రమేపీ పెరుగుతున్న క్రిప్టోకరెన్సీ బిట్‌కాయిన్ గురువారం క్రిప్టో ఎక్సేంజ్‌ల్లో ఒక్క ఉదుటన 1,00,000 డాలర్ల మార్క్‌ను దాటేసింది. కడపటి సమాచారం అందేటప్పటికి బిట్‌కాయిన్ 8 శాతం పైగా పెరిగి 1,04,000 డాలర్ల స్థాయిని (దాదాపు రూ.88 లక్షలు) తాకి కొత్త రికార్డును సృష్టించింది. క్రిప్టోకరెన్సీలకు సానుకూల రెగ్యులేటరీ వాతావరణం కల్పిస్తానంటూ అధ్యక్ష ఎన్నికల ప్రచారంలోనే డోనాల్డ్ ట్రంప్  ప్రకటించారు.

తాజాగా ఈ రంగానికి అనుకూలుడిగా పేరొందిన పాల్ ఆట్కిన్స్‌ను యూఎస్ మార్కెట్ రెగ్యులేటర్ సెక్యూరిటీస్, ఎక్సేంజ్ కమిషన్ (ఎస్‌ఈసీ)కు తదుపరి చీఫ్‌గా ట్రంప్ నామినేట్ చేయడంతో బిట్‌కాయిన్‌తో పాటు క్రిప్టోకరెన్సీలన్నీ పెద్దపెట్టున ర్యాలీ జరిపాయి. బిట్‌కాయిన్ సృష్టి జరిగిన తర్వాత గత 16 ఏండ్లలో తీవ్రహెచ్చుతగ్గులకులోనై 2022లో 16,000 డాలర్ల వద్దకు పతనమయ్యింది. తదుపరి ఈ రెండేండ్లలోనే 6.5 రెట్లు ర్యాలీ జరపడం గమనార్హం. బిట్‌కాయన్ తర్వాత పాపులర్ క్రిప్టోకరెన్సీ ఈథరన్ తాజాగా 6 శాతం పెరిగి 3,925 డాలర్లకు చేరగా, తక్కువ విలువ కలిగిన క్రిప్టో డిజికాయిన్ 10 శాతం ఎగిసి 0.45 డాలర్ల వద్దకు పెరిగింది.