calender_icon.png 15 October, 2024 | 6:50 AM

బిష్ణోయ్ హిట్‌లిస్ట్‌లో ప్రముఖులు

15-10-2024 02:20:56 AM

సల్మాన్‌ఖాన్, జీషన్ సిద్దిఖీ పేర్లు వెల్లడించిన నిందితులు 

విచారణలో మరిన్ని కీలక విషయాలు బహిర్గతం

సల్మాన్‌కు అదనపు భద్రత కల్పించిన పోలీసులు

ముంబై, అక్టోబర్ 14: మహారాష్ట్ర మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో ముంబై ఉలిక్కిపడింది. సిద్దిఖీ హత్య తర్వాత పోలీసులు జరిపిన విచారణలో బాబాతోపాటు అతని కుమారుడు జీషన్‌ను హత్యకు తమకు కాం ట్రాక్టు లభించినట్లు షూటర్లు తెలిపినట్లు విశ్వసనీయ సమాచారం.

సిద్దిఖీ హత్య జరిగిన ప్రాంతంలోనే జీషన్ కూడా ఉంటారని కాంట్రాక్ట్ ఇచ్చిన వ్యక్తులు చెప్పారని, కానీ ఇద్దరిపై దాడి చేసేందుకు అవకాశం దొరకలే దని వెల్లడించారు. జీషన్ సిద్దిఖీ, బాలీవుడ్ నటుడు సల్మాన్‌ఖాన్ కూడా తమ హిట్ లిస్టులో ఉన్నట్లు ఎన్‌ఐఏతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గతంలో వెల్లడించినట్లు తెలుస్తోంది.

ఈ విషయాన్ని ఇండియా టుడే తో బహిర్గతం చేసింది. ఈ గ్యాంగ్ హిట్‌లిస్ట్ ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని జైలులో ఉన్న బిష్ణోయ్ నుంచి ఎన్‌ఐఏ సేకరించినట్లు తెలిపింది. హత్యకు గురైన పంజాబీ సింగర్ సిద్ధు మూసేవాలా, అతని మేనేజర్ షగన్‌ప్రీత్‌సింగ్ వీరి లిస్టులో ఉన్నట్లు పేర్కొంది.  

హత్య వెనుక కారణమేంటి?

సిద్దిఖీ హత్య వెనుక కారణాలు స్పష్టంగా తెలియరాలేదు. బిష్ణోయ్ గ్యాంగ్‌కు చెందిన కొందరు సల్మాన్‌ఖాన్‌ను హెచ్చరించేందుకే అతని సన్నిహితుడైన సిద్దిఖీని హత్య చేసినట్లు పేర్కొన్నారు. గతంలోనూ అనేక సార్లు సల్మాన్‌ను చంపేస్తామని ఈ గ్యాంగ్ హెచ్చరించింది. ఓసారి ఆయన ఇంటిపైనా కాల్పు లు జరిపారు.

ఈ హత్య కేసులో అరెస్టయిన గుర్నైల్‌సింగ్ హర్యానాకు చెందినవాడు. ఇప్పటికే 3 కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. అతనికి జైలులో బిష్ణోయ్‌తో పరిచయం ఏర్పడిన తర్వాత బెయిల్ వచ్చాక ముంబైకి మకాం మార్చాడు. సిద్దిఖీ హత్య కేసులో ముంబై పోలీసులు మాత్రం మరో కోణంలో విచారణ చేస్తున్నారు.

బాంద్రాలోని మురికివాడల పునరావాస ప్రాజెక్టుకు సంబంధించి న వివాదంపై పోలీసులు దృష్టి సారిస్తున్నారు. ఇందులో సిద్దిఖీ అక్రమాలకు పాల్ప డ్డారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో హత్య ఏ కోణంలో జరిగిందనే అంశంపై పోలీసుల్లోనూ గందరగోళం నెలకొంది. కాగా, ఈ కేసు విచారణకు ముంబై క్రైంబ్రాంచ్ 15 బృందాలను నియమించింది. ఈ కేసులో బిష్ణోయ్ ముఠా ప్రమేయం, వ్యాపార వివాదాలపై వేర్వేరుగాదర్యాప్తు చేస్తున్నారు. 

సల్మాన్‌కు అదనపు భద్రత

సిద్దిఖీ హత్యతో సల్మాన్‌ఖాన్‌కు ముంబై పోలీసులు అదనపు భద్రత కల్పించారు. సల్మాన్ కుటుంబంతో నివసించే బాంద్రాలోని గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ వెలుపల డజన్‌కుపైగా పోలీసులను మోహరించారు. సిద్దిఖీకి సల్మాన్ చాలా సన్నిహితుడు. సల్మాన్‌కు ఎవరూ సాయం చేసినా ఇదే పరిస్థితి ఎదురవుతుందని బిష్ణోయ్ గ్యాంగ్ బెదిరించింది. 1998లో కృష్ణ జింక వివాదం నుంచి సల్మాన్‌కు ఈ గ్యాంగ్ నుంచి ప్రమాదం పొంచి ఉంది. 

పెప్పర్ స్ప్రే వినియోగం

సిద్దిఖీ హత్య కేసులో అరెస్టయిన ఇద్దరు నిందితుల నుంచి పోలీసులు రెండు తుపాకులతో పాటు పెప్పర్‌స్ప్రేను స్వాధీనం చేసుకున్నారు. ఒకరు గాలిలోకి పెప్పర్ స్పే చేసి కాల్పులు జరపగా, శివకుమార్ నేరుగా కాల్పులు జరిపాడు. హత్య జరిగిన సమయంలో సిద్దిఖీ వెంట ముగ్గురు పోలీసులు ఉన్నా ఆకస్మిక దాడిలో వారు ఏమీ చేయలేకపోయినట్లు అధికారులు తెలిపారు. హత్య కు బాధ్యత వహించిన బిష్ణోయ్ బిష్ణోయ్‌కు సన్నిహితుడు షుబు లోన్‌కార్ పరారీలో ఉండగా అతని సోదరుడు ప్రవీణ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. షూటర్లకు వీరే ఆశ్రయం కల్పించినట్లు తెలుస్తోంది. 

నిందితుడు మైనర్ కాదు

సిద్దిఖీ హత్య కేసులో నిందితుల్లో ఒకరైన ధర్మరాజ్ కశ్యప్‌కు ముంబై పోలీసులు వయసు నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా మైనర్ కాదని తేలింది. దీంతో ముంబైలోని కోర్టులో హాజరుపరిచగా కశ్యప్‌కు అక్టోబర్ 21 వరకు పోలీస్ కస్టడీకి అనుమతిని కోర్టు మంజూరు చేసింది. కశ్యప్ మైనర్ అని అతను తరఫు న్యాయవాది వెల్లడించడంతో నిర్ధారణ పరీక్షలకు కోర్టు ఆదివారం అనుమతించింది.

కాగా, మరో నిందితుడు గుర్మైల్ సింగ్‌కు అక్టోబర్ 21 వరకు ముంబై క్రైంబ్రాంచ్ కస్డడీకి కోర్టు ఇప్పటికే అనుమతిచ్చింది. వీరిద్దరి నుంచి 28 లైవ్ క్యాట్రిడ్జ్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న మరో షూటర్ శివకుమార్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. మహ్మద్ అక్తర్ అనే మరో వ్యక్తి ప్రమేయం కూడా ఈ కేసులో ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు చెప్పారు.