వైద్య సిబ్భందికి కలెక్టర్ ఆదేశం
వికారాబాద్,జనవరి 16: ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రసవాలు జరిగేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ వైద్యాధికారులను ఆదేశించారు. గురువారం నవాబ్ పేట్ మండల పర్యటనలో భాగంగా ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లో చేపడుతున్న పనులు, వట్టి మీనపల్లిలో ఇందిరమ్మ ఇండ్లు, పులుమామిడి పొలాల్లో రైతు భరోసా సర్వేలను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యులు అందుబాటులో ఉండి ప్రజలకు మెరుగైన సేవలందించాలన్నారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా ప్రసవాలు జరిగేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఆసుపత్రుల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు నిధులను కేటాయించడం జరుగుతుందని ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కుటుంబ నియంత్రణ శస్త్ర చికిత్సలు నిర్వహించేందుకు కూడా చర్యలు చేపట్టాలని కలెక్టర్ తెలిపారు.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చేపడుతున్న మరమ్మత్తులను వారం రోజుల లోపు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. పనులు చేపట్టే క్రమంలో నాణ్యత లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఆసుపత్రిలో లైట్లు, ఫ్యాన్లు సరిపడే విధంగా అమర్చుకోవాలని కలెక్టర్ వైద్యాధికారులకు సూచించారు. ఆసుపత్రి కిటికీలు, వెంటిలేటర్లకు దోమతెరల ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో 25 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను అభివృద్ధిపరిచేందుకు నిధులను కేటాయించడం జరిగిందని ఇందులో భాగంగానే నవాబ్ పెట్ ఆసుపత్రిని ఆదర్శంగా ఉండేలా తీర్చిదిద్దాలని కలెక్టర్ సూచించారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోనీ ఆపరేషన్ థియేటర్, ఇన్ పేషంట్ వార్డులను కలెక్టర్ పరిశీలించారు.
అనంతరం వట్టిమీనపల్లిలో ఇందిరమ్మ ఇళ్ల సర్వే , రైతు భరోసా సర్వే ప్రక్రియను జిల్లా కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, రైతు భరోసా ను అందించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ ఈ సందర్భంగా తెలిపారు. కలెక్టర్ ఆకస్మిక పర్యటనలో డిఎంహెచ్‌ఓ వెంకటరవణ, తహసిల్దార్ జయరాం, ఎంపీడీవో అనురాధ, పిహెచ్ సి వైద్యాధికారి డాక్టర్ రోహిత్, మీనపల్లి పంచాయతీ కార్యదర్శి గీత లు ఉన్నారు.