- ప్రపంచమంతా ఎగబడితే ఎలా!
- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్
వాషింగ్టన్, ఫిబ్రవరి 1: అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయగానే పదుల సంఖ్యలో ఎగ్జిక్యూటిమవ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకాలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో జన్మతః పౌరసత్వం లభించే హక్కును రద్దు చేశారు. ఈ నిర్ణయాన్ని నిలిపివేస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈక్రమంలోనే తాజాగా ట్రంప్ ఈ వ్యవహారంపై స్పందించారు. బానిసల పిల్లల కోసమే తొలినాళ్లలో జన్మతః పౌరసత్వాన్ని తీసుకొచ్చారని వ్యాఖ్యానించారు. బానిసల పిల్లలకు హక్కులు కల్పించాలనే ఉద్దేశంతో ఈ పౌరసత్వాన్ని అప్పట్లో ఆమోదించారని, అంతేగానీ.. ప్రపంచ జనాభా మొత్తం అమెరికాలో పోగయ్యేందుకు కాదని స్పష్టం చేశారు.
చాలామంది అమెరికాకు వస్తున్నారని, వారిలో అర్హతలు లేనివారు సైతం ఈ చట్టాన్ని ఉపయోగించుకుంటున్నారని వాపోయారు. ఈ విషయమై తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని స్పష్టం చేశారు. అక్కడ తమకు అనుకూల తీర్పు వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం.. తల్లిదండ్రుల వలస స్థితితో సంబంధం లేకుండా అమెరికాలో జన్మించిన వారందరికీ పౌరసత్వం లభించే విధానం అమల్లో ఉంది.