calender_icon.png 17 November, 2024 | 8:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిర్లాలు నెలకొల్పిన యూకో బ్యాంక్

17-11-2024 12:00:00 AM

చరిత్రాత్మక 1942నాటి క్విట్ ఇండియా ఉద్యమం సందర్భంగా పూర్తి స్వదేశీ బ్యాంక్‌ను నెలకొల్పాలన్న ప్రముఖ పారిశ్రామికవేత్త, దేశంలో బిర్లాల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించిన ఘనశ్యామ్ దాస్ బిర్లా సంకల్పం నుంచి పుట్టిందే యూకో బ్యాంక్. ప్రస్తుతం దేశలోని టాప్‌టెన్ పీఎస్‌యు బ్యాంక్‌లో ఒకటైన యూకో బ్యాంక్ 1943 జనవరిలో యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ పేరుతో కలకత్తా (ఇప్పటి కోల్‌కతా) ప్రధాన కేంద్రంగా జీడీ బిర్లా చైర్మన్‌గా ప్రారంభమయ్యింది.

రూ.2 కోట్ల జారీ మూలధనంతో ప్రారంభించగా, అందులో రూ.1 కోటి మూలధనాన్ని బిర్లా సమకూర్చారు. దేశంలోని వివిధ రంగాల్లో నిపుణులు డైరెక్టర్లుగా చేరారు. యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఒకేసారి శాఖల్ని తెరిచింది. పలు దేశాల్లోనూ బ్యాంకింగ్ శాఖల్ని నెలకొల్పింది.

యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్‌ను 1969లో కేంద్ర ప్రభుత్వం జాతీయం చేసుకున్న తర్వాత కూడా లండన్, సింగపూర్, హాంకాంగ్ శాఖల్లో కార్యకలాపాలు కొనసాగించింది. బంగ్లాదేశ్‌లో సైతం యునైటెడ్ కమర్షియల్ బ్యాంక్ పీఎల్‌సీ పేరుతో బ్యాంక్ ఉన్నందున, అంతర్జాతీయ బ్యాంకింగ్ కార్యకలాపాల్లో ఆయోమయం నెలకొంటుందన్న ఉద్దేశంతో 1985లో పార్లమెంట్‌లో చట్టం ద్వారా యునైటెడ్ కమర్షిల్ బ్యాంక్ పేరును యూకో బ్యాంక్‌గా మార్చారు. యూకో బ్యాంక్ 2004లో ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) జారీచేసి స్టాక్ ఎక్సేంజీల్లో లిస్టయ్యింది.

3,236 శాఖలు.. రూ.3.24 లక్షల కోట్ల ఆస్తులు

యూకో బ్యాంక్‌కు దేశవ్యాప్తంగా 2024 మార్చినాటికి 3,230 శాఖలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 30 శాఖలున్నాయి. దేశంలో 2,564 ఏటీఎంలను నిర్వహిస్తున్నది. 43 జోనల్ కార్యాలయాలు ఉన్నాయి. సింగపూర్, హాంకాంగ్‌ల్లో విదేశీ బ్యాంకింగ్ శాఖల్ని నిర్వహిస్తున్నది. 21,456 మంది ఉద్యోగులు ఉన్నారు ఈ బ్యాంక్ ఆస్తుల పరిమాణం తాజా గణాంకాల ప్రకారం రూ.3.24 లక్షల కోట్లు.  యూకో బ్యాంక్‌లో కేంద్ర ప్రభుత్వానికి 95.39 శాతం వాటా ఉన్నది. ఈ  బ్యాంక్‌కు ప్రస్తుతం అశ్విని కుమార్ ఎండీ, సీఈవోగా  వ్యవహరిస్తున్నారు. 

రూ.49,342 కోట్ల మార్కెట్ విలువ

ఆస్తుల రీత్యా పీఎస్‌యూ బ్యాంక్‌ల్లోకెల్లా యూకో బ్యాంక్ 10వ స్థానంలో ఉన్నప్పటికీ, మార్కెట్ విలువలో 8వ స్థానాన్ని ఆక్రమిస్తున్నది. స్టాక్ మార్కెట్‌లో ట్రేడయ్యే యూకో బ్యాంక్ ప్రస్తుత మార్కెట్ విలువ రూ.49,342 కోట్లు. గడిచిన మూడేండ్లలో ఈ షేరు 192 శాతం పెరిగింది.