calender_icon.png 11 February, 2025 | 7:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా

10-02-2025 12:35:38 AM

  1. మణిపూర్ గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు రాజీనామా లేఖ అందజేత
  2. అంతకుముందు ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం
  3. ఇప్పటికే ఆలస్యమైందన్న కాంగ్రెస్
  4. కొంప ముంచిన ఆడియో?

ఇంఫాల్, ఫిబ్రవరి 9: మణిపూర్ సీఎం ఎన్ బీరెన్ సింగ్ తన ముఖ్యమంత్రి పదవికి రాజీమానా చేశారు. కొందరు బీజేపీ నాయకులతో కలిసి ఆదివారం సాయంత్రం ఇంఫాల్‌లోని రాజ్ భవన్‌కు వెళ్లిన బీరెన్.. తన రాజీనామా లేఖను ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ కుమార్ భల్లాకు సమర్పించారు.

ముఖ్యమంత్రిగా మణిపూర్ ప్రజలకు సేవ చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నట్టు ఈ సందర్భంగా లేఖలో బీరెన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు సహకరించిన కేంద్ర ప్రభుత్వానికి లేఖ ద్వారా బీరెన్ కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో అభివృద్ధి పను లను ఇకపై కూడా కొనసాగించాలని కేంద్రా న్ని కోరారు. అయితే బీరెన్ అనూహ్య రాజీనామా ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశమైంది.

ఆడియోనే కొంపముంచిందా?

మణిపూర్‌లో గత రెండేళ్లుగా మైతీ వర్గాల మధ్య పెద్ద ఎత్తున గొడవలు జరగుతున్నాయి. ఈ ఘర్షణల్లో వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అయితే గొడవలపై తాజాగా సంచలన విషయం బయటకొచ్చింది. మైతీ వర్గానికి చెందిన ప్రజలు ఆయుధశాలను దోచుకోవడానికి, గొడవలకు సంబంధించిన కేసుల్లో మైతీ వర్గానికి చెందిన నిందితులు అరెస్టు కాకుండా ఉండేందుకు బీరెన్ సహాయం చేస్తున్నారంటూ ఆరోపణలు వచ్చాయి.

అందుకు సంబంధించిన ఆడియో బయటకొచ్చింది. ఈ విషయంపై కుకీలకు సంబంధించిన న్యాయవాది సుప్రీం కోర్టును ఆశ్రయించారు. బీరెన్ సింగ్ గొంతుతో ఆడియోలోని గొంతు 93శాతం సరిపోలినట్టు కోర్టు వివరించారు. దీంతో కోర్టుకు ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికను కోరింది. 

చాలా ఆలస్యమైంది..

సీఎం పదవికి బీరెన్ సింగ్ రాజీనామా చేయడంపట్ల కాంగ్రెస్ అగ్రనేత జైరామ్ రమేశ్ స్పందించారు. ఇప్పటికే బీరెన్.. తన పదవికి రాజీనామా చేయాల్సి ఉండగా చాలా ఆలస్యంగా ఆయన పదవి నుంచి తప్పుకున్నారని విమర్శించారు. ప్రధాని నరేంద్రమోదీ తరచూ విదేశీ పర్యటనల వల్ల ఈ మణిపూర్ సమస్యను పరిష్కరించేందుకు శ్రద్ధ పెట్టడం లేదని ఆరోపించారు. 

రాజీనామాకు ముందు పార్టీ పెద్దలతో..

మణిపూర్‌లో హింసాకాండను అరికట్టడంలో బీరెన్ సింగ్ ప్రభుత్వం విఫలమైందని ప్రతిపక్షాలు ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నాయి. తాజాగా ఆ గొడవల వెనుక బీరెన్ హస్తం ఉందనేలా ఆడియో బయటికొచ్చింది. దీంతో ప్రతిపక్షాలు ఆయన ప్రభుత్వంపై అవిశ్వాసానికి సిద్ధమయ్యాయి.

కొంత మంది సొంత పార్టీ నేతలు కూడా బీరెన్‌ను వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం ఉదయం ఢిల్లీ వెళ్లిన బీరెన్.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశమయ్యారు. అనంతరం మణిపూర్ చేరుకుని తన రాజీనామా లేఖను గవర్నర్‌కు అందించారు.