01-03-2025 08:20:20 PM
ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ అఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ...
మంచిర్యాల (విజయక్రాంతి): పక్షులు జీవ వైవిధ్యంతో పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మానవాళికి మేలు చేస్తున్నాయని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డాక్టర్ సువర్ణ అన్నారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాల్లో జిల్లా అటవీ శాఖ, వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్, నేచర్ కన్జర్వేషన్ ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కవ్వాల్ బర్డ్ ఫెస్టివల్ కార్యక్రమంలో కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫీల్డ్ డైరెక్టర్ శాంతారాం, మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, సి.సి.ఎఫ్. శరవణన్, మంచిర్యాల, కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాల అటవీ శాఖ అధికారులు శివ్ అశిష్ సింగ్, నీరజ్ కుమార్, ఇనిస్టిట్యూట్ అఫ్ బర్డ్స్ స్టడీస్ (రిషి వాలీ) డాక్టర్ శాంతారామ్, వెట్ లాండ్స్ ఎక్స్ పర్ట్ డాక్టర్ గుజ్జా భిక్షం, బర్డ్స్ మైగ్రేషన్ స్టడీస్ ప్రముఖులు డాక్టర్ సాతియా సెల్వం, హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ ఎన్.జి.ఓ. సీతారాంరెడ్డి, బర్డ్ బయో జియోగ్రఫీ ప్రముఖులు డాక్టర్ రాబిన్ విజయన్ లతో కలిసి హాజరయ్యారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ మాట్లాడుతూ... పర్యావరణంలో పక్షుల ప్రాముఖ్యత ప్రతి ఒక్కరు తెలుసుకోవాలని, ఈ నేపథ్యంలో బర్డ్ ఫెస్టివల్ వర్క్ షాప్ లు దోహదపడతాయని అన్నారు. పక్షుల సంరక్షణ ఒక అలవాటుగా మార్చుకోవాలని, ఇందు కోసం కార్పొరేట్ సంస్థలు స్వచ్ఛందంగా ముందుకు రావాలని, పర్యావరణంలో పక్షుల శబ్దాలను పరిశీలిస్తూ వాటి గురించి నిపుణుల సహాయంతో వివరాలు తెలుసుకోవాలన్నారు. దేశ మాజీ ప్రధానమంత్రి ఇందిరా గాంధీ విద్యార్థి దశలోనే పక్షులపై ప్రేమ చూపిస్తూ ఒక అలవాటుగా చేసుకోవడం వలన ప్రధాని అయిన తరువాత పక్షుల పరిరక్షణ, అధ్యయనం కోసం ప్రత్యేక చర్యలు తీసుకున్నారని తెలిపారు. హైదరాబాద్ వంటి నగరాలలో కాకులు చాలా వరకు అంతరించిపోయాయని, రాష్ట్ర పక్షి అయిన పాలపిట్టను దసరా పర్వదినాలలో బంధించి చూడటం నేరమని, సహజ సిద్ధంగానే చూడాలని అన్నారు.
సంక్రాంతి పండుగ సమయంలో పతంగుల కోసం వాడే మాంజా దారం వలన ఎన్నో పక్షులు చనిపోతున్నాయని, ఇలాంటి చర్యలు మానుకోవాలని అన్నారు. కొన్ని రకాల పక్షులు వేటగాళ్ళ బారిన పడి అంతరించిపోతున్నాయని అన్నారు. వివిధ దేశాలలోని అనేక రకాల జాతుల పక్షులు వాతావరణ మార్పులను గుర్తించి తమ జ్ఞానంతో వందల, వేల కిలోమీటర్లు ప్రయాణించి మన దేశానికి వచ్చి తిరిగి వాటి దేశాలకు వెళ్తాయని అన్నారు. సలీం అలీ దేశంలోని వివిధ రాష్ట్రాలలో సర్వే నిర్వహించి పక్షులపై పుస్తకం రూపొందించారని, మన రాష్ట్రంలో కవ్వాల్ ప్రాంతంపై పరిశోధించారని తెలిపారు. పక్షులను రక్షించుకోవడం, ఆవశ్యకతపై ప్రజలందరికీ అవగాహన కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. బర్డ్ ఫొటోగ్రఫీలో పక్షుల ప్రతి కదలికను గమనించి, వాటి జీవన విధానాన్ని తెలుసుకోవడం జరుగుతుందని, ఈ క్రమంలో జీవితంలో పక్షుల అవసరం తెలుసుకుంటారని తెలిపారు.
పిచ్చుక జాతి అభివృద్ధి కోసం మనమందరం సమిష్టిగా కృషి చేద్దామని అన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని మంచిర్యాల, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, ఆదిలాబాద్ లలో గోదావరి, ప్రాణహిత నదీ తీరాన ఉన్న అటవీ ప్రాంతంలో పక్షి సంపద అభివృద్ధి కోసం సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా అధిక మొత్తంలో అటవీ ప్రాంతం కలిగి ఉందని, జిల్లాలోని అడవులలో అనేక రకాల పక్షి జాతులు జీవిస్తున్నాయని తెలిపారు. విద్యాసంస్థలలో విద్యార్థులను చారిత్రాత్మక ప్రదేశాలకు తీసుకువెళ్ళి విజ్ఞానం కల్పించడంతో పాటు జీవ వైవిధ్యంలో ప్రక్షుల ప్రాముఖ్యతపై విద్యార్థులకు వివరించాలని తెలిపారు.
వర్క్ షాప్ లో దేశంలోని వివిధ ప్రాంతాలలో సంచరిస్తున్న పక్షుల వివరాలు, వాటి జీవన విధానం, పర్యావరణంలో పక్షుల పాత్రపై అవగాహన కల్పించారు. అనంతరం జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ లో సంచరించే వివిధ రకాల పక్షులతో కూడిన బ్రౌచరు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఎఫ్.డి.ఓ. సర్వేశ్వర్ రావు, వరల్డ్ వైల్డ్ లైఫ్ అధికారులు ఫరిదా తంపాల్, బండి రాజేశ్వర్, పలు స్వచ్ఛంద సంస్థల ప్రముఖులు, అటవీ శాఖ అధికారులు, అటవీ కళాశాల (ములుగు) విద్యార్థులు, జిల్లాలోని పాఠశాలల ఉపాధ్యాయులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.