calender_icon.png 12 February, 2025 | 6:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బర్డ్‌ఫ్లూ కలకలం

12-02-2025 01:33:38 AM

  1. ఏపీలోని పలు జిల్లాల్లో ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ వ్యాప్తి  
  2. అప్రమత్తమైన తెలంగాణ ప్రభుత్వం
  3. పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశం
  4. రాష్ట్ర సరిహద్దుల్లో 24 చెక్‌పోస్టులు
  5. నల్లగొండ, సూర్యాపేట, గద్వాల జిల్లాల సరిహద్దుల్లో కోళ్ల వాహనాల అడ్డగింత

హైదరాబాద్/నల్లగొండ, ఫిబ్రవరి 11 (విజయక్రాంతి): ఏపీ సహ పలు రాష్ట్రా ల్లో బర్డ్‌ఫ్లూ సోకి కోళ్లు మృత్యువాత పడుతుండగా తెలంగాణ ప్రభుత్వం మంగళ వారం అప్రమత్తమైంది. ఈక్రమంలో పొరుగు రాష్ట్రం ఏపీ నుంచి కోళ్ల దిగుమతిని నిలిపివేసింది.

ఈ మేరకు కోళ్లు చనిపోవడానికి కారణమవుతున్న హైలీ పాథోజెనిక్ ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా (హెచ్‌పీఏఐ) వ్యాప్తి చెందకుండా నివార ణ చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లా కలెక్టర్లను ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచి ఘోష్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇన్‌ఫ్లూయెంజాపై పౌల్ట్రీ రైతులు, వ్యాపారులు, ప్రజలకు అవగాహన కల్పించాలని ప్రభు త్వం సూచించింది.

వ్యాధి సోకిన కోళ్లను సకాలంలో గుర్తించాలని, అది ఇతర కోళ్ల కు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పింది. అలాగే చనిపోయిన వాటిని నిర్లక్ష్యంగా పడేయకుండా వాటిని ఎలా పూడ్చా లో అవగాహన కల్పించాలని వివరించింది. కోళ్ల మరణాలకు సంబంధించి పశువైద్య, పశుసంవర్ధక శాఖ సిబ్బందికి ఎప్పటికప్పు డు సమాచారం అందేలా చూడాలని ప్రభు త్వం అదేశించింది.

ఇతర రాష్ట్రాల  తెలంగాణలో ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా నిరో ధించడానికి తీసుకోవాల్సిన చర్యలపై అటవీ, పోలీసు, ఆరోగ్య, పశువైద్య, పశుసంవర్ధక శాఖలతో జిల్లాస్థాయి సమావేశాలను ఏర్పా టు చేసుకోవాలని కలెక్టర్లకు దిశానిర్దేశం చేసింది. సరిహద్దులను సర్కారు అప్రమత్తం చేసింది. ఈ మేరకు తెలంగాణ సరిహద్దుల్లో 24 చెక్‌పోస్టులను ఏర్పాటు చేసింది. 

ఏపీలో రెండు చోట్ల వైరస్ నిర్ధారణ..

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని రెండు ప్రాంతాల్లో కోళ్లమర ణాలకు ఏవియన్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్ కారణమని తేలిందని అక్కడి అధికారులు చెప్పారు. వివిధ ప్రాంతాల్లో చనిపోయిన కోళ్ల నమూనాలను మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హైసెక్యూరిటీ యానిమల్ డిసీజెస్ ల్యాబ్‌కు పంపారు. అందులో పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మండలం వేల్పూరు, తూర్పు గోదావరి జిల్లా పెరవలి మండలం కానూరు అగ్ర హారంలోని కోళ్ల ఫారాల నుంచి పంపిన రెండు నమూనాలు పాజిటివ్‌గా వచ్చాయన్నారు. 

పడిపోయిన చికెన్ ధరలు..

బర్డ్‌ఫ్లూ కలకలం నేపథ్యంలో ఏపీలో చికె న్, గుడ్ల ధర భారీగా పడిపోయింది. ఆదివా రం వరకు కేజీ రూ.220 ఉన్న చికెన్ ధర మంగళవారం రూ.150 నుంచి 170 వరకు పడిపోయింది. ఉభయ గోదావరి జిల్లాలో ఇప్పటికే 50 లక్షలకుపైగా కోళ్లు దీని బారినపడి మృతి చెందినట్లు అంచనా. కృష్ణా జిల్లా లోనూ వైరస్ లక్షణాలు వెలుగు చూడడం తో తెలంగాణ ప్రభుత్వం అప్రమ త్తమైంది. 

నల్లగొండ జిల్లాలో చెక్‌పోస్టులు.. 

 ఏపీ నుంచే వచ్చే కోళ్ల వాహనాలను సరిహద్దులోనే అడ్డుకోవాలని మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. దీంతో అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టుల వద్ద అధికారులు పహారా కాస్తూ ఏపీ నుంచి వచ్చే బాయిలర్ కోళ్ల వాహనాలను అడ్డుకొని వెనక్కు పంపుతున్నారు. బర్డ్ ప్లూ వార్తల నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కోదాడ మండలం రామాపురం సరిహద్దు వద్ద ఈ నెల 7వ తేదీనే జిల్లా పశు సంవర్థకశాఖ అధికారులు చెక్‌పోస్ట్ ఏర్పాటు చేశారు.

రాత్రివేళ వాహనా లు చెక్‌పోస్టు దాటి వెళ్లే అవకాశం ఉండడంతో సిబ్బందిని అప్రమత్తం చేసినట్లు జిల్లా పశుసంవర్థకశాఖ అధికారి శ్రీనివాసరావు తెలిపారు. అలాగే నల్లగొండ జిల్లా లోని నాగార్జున సాగర్ వద్ద  బుధవారం చెక్‌పోస్టు ఏర్పాటు చేయనున్నట్లు తెలిసింది. దామరచర్ల మండలం వాడపల్లి వద్ద ఇప్పటికే చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. 

గద్వాల జిల్లా పుల్లూరు టోల్‌ప్లాజా వద్ద..

జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండల పరిధి పుల్లూరు టోల్ ప్లాజా వద్ద చెక్‌పోస్టు ఏర్పాటు చేశారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు నుంచి కోళ్లతో వస్తున్న వాహనాలను గుర్తించి వెనక్కి పంపిస్తున్నారు. మంగళవారం తమిళనాడు నుంచి కామారెడ్డికి వెళ్తున్న కోడిపిల్లల వాహనాన్ని తిప్పి పంపినట్లు అధికారులు తెలిపారు.