calender_icon.png 17 April, 2025 | 3:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సిద్దిపేట జిల్లాలో బర్డ్ ఫ్లూ..

08-04-2025 11:14:39 PM

వ్యాధి సోకిన కోళ్లు, కోడిగుడ్లు సరఫరా నిలిపివేయాలని అదనపు కలెక్టర్ ఆదేశం..

సిద్దిపేట (విజయక్రాంతి): సిద్దిపేట జిల్లాలో బర్డ్ ఫ్లూ తొగుట మండలం కన్గల్ గ్రామంలో మైనా లేయర్ కోళ్ల ఫామ్ లోని కోళ్లకు ఏవియన్ ఇన్ఫ్లుంజా వైరస్ (బర్డ్ ఫ్లూ) నిర్ధారణ కావడంతో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సంభంధిత శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని కోళ్ల ఫారంలో మొదటిసారి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందని, బర్డ్ ఫ్లూ ప్రభావం ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా, మనుషులకు సోకకుండా అన్ని ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ లోని కోళ్లు అన్నింటినీ శాస్త్రీయ పద్ధతిలో భూమిలో పూడ్చివేయాలని ఆదేశించారు. కోళ్ల ఫామ్ లో పనిచేసే వారికి వైద్య పరీక్షలు నిర్వహించాలని, మైనా కోళ్ల ఫామ్ నుంచి  కిలోమీటర్ లోపు గల కోళ్లను, కోడిగుడ్లు విక్రయించకుండా చర్యలు  తీసుకోవాలని చెప్పారు. బర్డ్ ఫ్లూ సోకిన కోళ్ల ఫామ్ పరిసర ప్రాంతాలలో వాహనాలు రాకపోకలు జరగకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలోని ప్రజలు బర్డ్ ఫ్లూ పై అనుమానాలు ఉంటే జిల్లా పశుసంవర్ధక  శాఖ కంట్రోల్ రూమ్ నెంబర్ 8500404016 ఫోన్ చేసి నివృత్తి చేసుకోవాలన్నారు. 

74 డిగ్రీల సెంటిగ్రేడ్ వరకు కోళ్ల మాంసాన్ని, గుడ్లను ఉడికిస్తే వైరస్ బతకదన్నారు. మనదేశంలో 120 డిగ్రీల సెంటిగ్రేడ్ కు పైన ఉడికించిన ఆహారాన్ని తీసుకోవడం సహజంగా జరుగుతుందనీ, ప్రజలు ఎలాంటి ఆందోళన పడుద్దన్నారు. ఈ సమావేశంలో పశుసంవర్ధక శాఖ జాయింట్  డైరెక్టర్  అశోక్ కుమార్, జిల్లా వైద్యరోగ్యశాఖాధికారి డాక్టర్ పల్వాన్ కుమార్, సిఐ మల్లేష్ గౌడ్, డిపిఆర్ఓ రవికుమార్, డివిజనల్ పంచాయతీ అధికారి మల్లికార్జున్, రెవెన్యూ, ట్రాన్స్పోర్ట్, అటవీ, పశుసంవర్ధక శాఖ అధికారులు పాల్గొన్నారు.