calender_icon.png 24 October, 2024 | 7:49 AM

బిరా బిరా కృష్ణమ్మ పరుగులు!

09-08-2024 01:28:07 AM

  1. ఎగువన కురుస్తున్న వర్షాలకు నాగార్జున సాగర్‌కు వరద పోటు
  2. మొత్తం 26 క్రస్టుగేట్లు ఎత్తివేత.. ఈ ఏడాదిలో అన్ని గేట్లు ఎత్తడం ఇదే తొలిసారి 
  3. శ్రీశైలం నుంచి 3.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
  4. పులిచింతల నుంచి దిగువకు భారీగా ప్రవాహం

నల్లగొండ, ఆగస్టు 8 (విజయక్రాంతి): నాగార్జున సాగర్‌కు మళ్లీ వరద పెరిగింది. గురువారం మధ్యాహ్నం వరకు 22 క్రస్టుగేట్ల ద్వారా నీటిని విడుదల కొనసాగించిన అధికారులు.. ఆ తరువాత ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో 26 గేట్లు ఎత్తి దిగువకు జలాలు వదిలారు. ఈ ఏడాది సాగర్ అన్ని క్రస్టుగేట్లు ఎత్తడం ఇదే తొలిసారి. సాగర్‌కు ఎగువ నుంచి ప్రస్తుతం 3.90 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. శ్రీశైలం రిజర్వాయర్ 10 క్రస్టుగేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3.08 లక్షల క్యూసెక్కులు, కుడి, ఎడమగట్టు విద్యుత్ కేంద్రాల్లో  విద్యుదుత్పత్తి కొనసాగిస్తూ మరో 64 వేల క్యూసెక్కులు నదిలోకి వదులున్నారు.

ఈ ప్రవాహం నేరుగా నాగార్జున సాగర్‌కు చేరుతోంది. నాగార్జున సాగర్ 26 గేట్లు ఎత్తడం దిగువ పులిచింతలకు కృష్ణమ్మ పరుగులు పెడుతోంది. పులిచింతల ప్రాజెక్టు నీటిమట్టాన్ని అధికారులు 32 టీఎంసీల వద్ద స్థిరంగా కొనసాగిస్తున్నారు. ప్రాజెక్టు 11 క్రస్టుగేట్లను ఎత్తి 2.80 క్యూసెక్కుల ప్రవాహాన్ని నదిలోకి వదులుతుండడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద నీటిమట్టం గణనీయంగా పెరుగుతోంది. శని, ఆదివారం సెలవులు కావడంతో సాగర్ సందర్శనకు భారీగా సందర్శకులు వచ్చే అవకాశం ఉన్నది. డ్యాం అధికారులు భద్రత విషయంలో పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.