calender_icon.png 24 October, 2024 | 2:46 AM

జీనోమ్‌వ్యాలీలో బయోప్రాసెస్ డిజెన్ సెంటర్

24-10-2024 12:13:36 AM

థెర్మోఫిషర్ సైంటిఫిక్ కంపెనీతో ఒప్పందం: మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్, అక్టోబర్ 23 (విజయక్రాంతి): అమెరికాలోని బోస్టన్ కేంద్రం గా ఉన్న ఫార్చూన్-500 కంపెనీ ‘థెర్మో ఫిషర్ సైంటిఫిక్’ హైదరాబాద్ జీనోమ్‌వ్యాలీలో బయోప్రాసెస్ డిజైన్ సెంటర్ ను నెలకొల్పేందుకు ఒప్పందం కుదుర్చుకుందని ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. 10 వేల చదరపు అడుగుల నిర్మిత స్థలంలో 2025 తొలి త్రైమాసికంలో డిజైన్ సెంటర్ పూర్తిస్థాయిలో వినియోగంలోకి వస్తుందని వెల్లడించారు.

బుధవారం సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, థెర్మోఫిషర్ సైంటిఫిక్ సంస్థకు మధ్య ఇందుకు సంబంధించిన ఎంఓయూ జరిగింది. కొవిడ్ సమయంలో అత్యవసర టెస్ట్ కిట్లను ఉత్పత్తి చేసి ఎఫ్‌డీఏ ప్రశంసలు పొందిన ఈ సంస్థ కొవిడ్ వ్యాక్సిన్లను తొలుత ఉత్పత్తి చేసిన ఫైజర్, మోడర్నాలకు కావాల్సిన రీ ఏజెంట్లు, ల్యాబ్ రసాయనాలు సరఫరా చేసిందని మంత్రి చెప్పారు.

థర్మోఫిషర్ సైంటిఫిక్ ప్రధానంగా ఔషధ పరిశ్రమకు, రోగనిర్ధారణ పరీక్షలకు పరికరాలు, రసాయనాలను సరఫరా చేస్తుందని, దీని ఏర్పాటుతో స్థానిక ఫార్మా, లైఫ్ సైన్సెస్ కంపెనీలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని మంత్రి తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరున్న ఈ సంస్థ దేశంలో అడుగుపెట్టడానికి తెలంగాణను ఎంచుకోవడం సంతోషదాయ కమన్నారు.

1,800 బయోఫార్మా కంపెనీల ఏర్పాటుతో రాష్ట్రం దేశంలో ఔషధ ఉత్పత్తి, పరిశోధనలకు కేంద్రబిందువుగా ఉందని పేర్కొన్నారు. బయో ప్రాసెస్ డిజైన్ సెంటర్‌లో అత్యాధునిక ప్రయోగశాలలు, పరిశోధన ఏర్పాట్లు ఉంటాయని వెల్లడించారు. భారత ఫార్మా, లైఫ్ సైన్సెస్ ఉత్పత్తుల ఎగుమతుల్లో రాష్ట్రం వాటా 33 శాతంగా ఉందని తెలిపారు.

రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న స్కిల్ యూనివర్సిటీ వల్ల పరిశ్రమకు అవసరమైన నైపుణ్యంతో కూడిన మానవ వనరులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ 80 మందికి శిక్షణనిస్తోందని వెల్లడించారు. జీనోమ్‌వ్యాలీ మూడో దశ విస్తరణ పనులు చురుకుగా సాగుతున్నాయని, దీని వల్ల మరిన్ని ఫార్మా, లైఫ్ సైన్సెస్ సంస్థల ఏర్పాటుకు వీలు కలుగుతుందని వివరించారు.

నవంబర్ 18న ఫార్మారంగానికి అవసరమయ్యే కృత్రిమ మేథా సదస్సు జరుగుతుందని తెలిపారు. ఎంవోయూ సంతకాల కార్యక్రమంలో థెర్మో ఫిషర్ సైంటిఫిక్ ప్రతినిధులు ఫ్రెడ్ లోవెరీ, డేనియెల్లా క్రాంప్, టోనీ అస్సియారిటో, శ్రీనాథ్ వెంకటేశ్, సరిత రావత్, రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు టీజీఐఐసీ సీఈవో మధుసూదన్, తెలంగాణ లైఫ్‌సైన్సెస్ సీఈవో శక్తి నాగప్పన్ తదితరులు పాల్గొన్నారు.