calender_icon.png 20 January, 2025 | 4:56 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జంతు రక్షణతోనే జీవ వైవిధ్యం

04-10-2024 12:00:00 AM

జంతు సంక్షేమం అనేది కేవలం జంతువుల హక్కుల రక్షణకు పరిమితమైనదే కాకుండా, సమాజం, పర్యావరణంపై సానుకూల ప్రభావం చూపించే బాధ్యతగా పరిగణించాలి. జంతువులు కూడా మనుషుల వలె బాధ, ఆనందం అనుభవించగల శక్తి కలిగిన జీవులు కాబట్టి, వాటికి మౌలిక హక్కులు ఉండటం అవసరం. ఆహారం, నీరు, ఆశ్రయం, వైద్యం వంటి అవసరాలను సమాజం తీర్చాల్సిన బాధ్యత ఉంది. వేట, క్రూరత్వం,లేబరేటరీలో ప్రయోగాలు వంటి హింసాత్మక చర్యలను అరికట్టేందుకు కఠిన చట్టాలు అమలులోకి రావాలి.

జంతువులు పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తాయి. వాటి ఆవిష్కరణ లేకుండా జీవవైవిధ్యం క్షీణిస్తే, పర్యావరణ సంక్షోభాలు మరింత తీవ్రమవుతాయి. హింసాత్మక చర్యలను ప్రోత్సహించే మాంసం, పౌల్ట్రీ పరిశ్రమలు, వన్యప్రాణుల రవాణా, వేటలు వంటి రంగాలను నియంత్రించాల్సిన సమయం ఇది.

ప్రతి సంవత్సరం అక్టోబర్ 4న జరుపుకునే ప్రపంచ జంతు సంక్షేమ దినోత్సవం, జంతువులకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరాన్ని మనకు గుర్తు చేస్తుంది. పేటా,  బ్లూ క్రాస్ వంటి సంస్థలు జంతు హక్కుల పరిరక్షణ కోసం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. అయితే, చట్టాలు మాత్రమే కాదు, ప్రతి పౌరుడు జంతు సంక్షేమం పట్ల బాధ్యతతో ఉండాలి.

ప్రేమతో జంతువులను చూసుకోవడం ద్వారా సమతుల్య జీవన విధానాన్ని కొనసాగించవచ్చు. మనిషి, జంతువుల మధ్య అవినాభావ సంబంధం ఉంది. ఏ జంతువును మనం ప్రేమగా దగ్గరకు తీస్తే అవి మన పట్ల విశ్వాసం చూపిస్తాయి. మనతో సమానంగా అవి కూడా జీవించేలా అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉంది.

అయితే వేటగాళ్లనుంచి వాటిని కాపాడుకోవడం కష్టంగా మారింది. జంతు సంక్షేమం కోసం తీసుకువచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయడం ద్వారా వాటిని కాపడుకోవచ్చు. మూగజీవాల పట్ల ప్రేమ, జాతి, దయ, మానవత్వం కలిగి ఉండాలని చిన్నారులకు విద్యార్థి దశనుంచే బోధించడం ద్వారా జంతుజాలాన్ని కాపాడుకోవచ్చు. మానవ మనుగడకు అనివార్యమైన జంతు సంపదను పరిరక్షించడం, వృద్ధి చేయడం, తగిన ఆదరణను అందించడం మనందరి బాధ్యత.

తాజా సాంకేతికతలు, ముఖ్యంగాఏఐ, ఐఏటీ జంతు సంక్షేమంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాయి. కెమెరా ట్రాప్‌లు, సెన్సార్లు వన్యప్రాణుల ఆరోగ్యం, ప్రవర్తనను పర్యవేక్షించడంలో ఉపయోగపడుతున్నాయి.ఏఐ ఆధారిత వ్యాధి నిర్ధారణ, చికిత్స పద్ధతులు పశువైద్య రంగంలో కొత్త మార్గాలను చూపిస్తున్నాయి. ఈ సాంకేతికతలు జంతు సంక్షేమాన్ని మెరుగుపరచడమే కాకుండా, సమాజం, పర్యావరణానికి సానుకూల మార్పులు తీసుకురావడంలో సహాయపడుతున్నాయి.

డా.కృష్ణ కుమార్ వేపకొమ్మ