21-02-2025 01:27:12 AM
* రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
హైదరాబాద్, ఫిబ్రవరి 20 (విజయక్రాంతి): హెల్త్ టెక్, ఫార్మా, లైఫ్ సెన్సైస్ రంగాల్లో తెలంగాణను ప్రపంచంలో అగ్రగామిగా నిలిపేందుకు ఈ నెల 25, 26 తేదీల్లో బయో ఆసియా - 2025 సదస్సును హైదరాబాద్‌లోని హెఐసీసీలో అత్యంత ప్రతిష్ఠాత్మ కంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసినట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖమంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు తెలిపారు. గురువారం ఆయన ఈమేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
ఈ ఏడాది ఏఐ -ఆధారిత ఆరోగ్య సంరక్షణ పరివర్తన, లైఫ్ సెన్సైస్‌లో ఆవిష్కరణలు, డేటా ఇంటర్ ఆపరేబిలిటీ, క్లినికల్ ట్రయల్స్‌లో భారత్ పాత్ర తదితర అంశాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. ఈ వేదిక ద్వారా జీవవైవిధ్య, ఫార్మా రంగాలకు చెందిన జాతీ య, అంతర్జాతీయ నిపుణులు, ఆవిష్కర్తలను ఒకేచోటుకు చేర్చే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు. దేశీయ, విదేశీ మార్కెట్లలో లైఫ్ సెన్సైస్ రంగంలో ఉన్న అవకాశాలు, సవాళ్లను ఈ సదస్సులో ప్రత్యేకంగా చర్చిస్తామని వెల్లడించారు.
సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, క్వీన్స్‌ల్యాండ్ గవర్నర్ డాక్టర్ జెన్నెట్ యంగ్, జీ షెర్ఫా అమితాబ్‌కాంత్, అమ్జెన్ చైర్మన్, సీఈవో రాబర్ట్ ఏ బ్రాడ్‌వే, జీనోమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సింగపూర్ ఈడీ ప్రొఫెసర్ పాట్రిక్ టాన్, మెడ్ ట్రానిక్ సీటీవో డాక్టర్ కెన్ వాషింగ్టన్, మిల్టెని బయోటెక్ ఎండీ డాక్టర్ బోరిస్ తదితరులు పాల్గొంటారన్నారు.
ఈ నెల 25న జరుగబోయే సీఈవో కాన్ క్లేవ్‌లో ఇస్రో మాజీ చైర్మన్ డాక్టర్ ఎస్ సోమనాథ్, డాక్టర్ రెడ్డీస్ లేబొరేటరీస్ చైర్మన్ సతీశ్‌రెడ్డి, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ చైర్మన్, ఎండీ డాక్టర్ కృష్ణ ఎల్లా, లారస్ ల్యాబ్స్ సీఈవో డాక్టర్ సత్యనారాయణ చావా, నోవార్టిస్ అప్మా ప్రాంత చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ సీజర్ కాన్సెప్షన్, లిల్లీ ఇండియా అధ్యక్షుడు, జీఎం విన్సెల్ టక్కర్ తదితరులు పాల్గొంటారని తెలిపారు.